- ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ
- ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
- ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు
ఛత్తీస్‌గఢ్, మహా: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జై రామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరు మంది మరణించగా.. 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోర్బా ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి బోగీ.. గూడ్స్ రైలు పైకి ఎక్కింది. ప్రమాద స్థలం నుంచి వచ్చిన వీడియోలలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం హౌరా రూట్ మార్గంలో జరగడం వలన రైలు రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, పలు రైళ్లను దారి మళ్లించారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు..
అయితే, రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సిగ్నలింగ్ లోపం లేదా మానవ తప్పిదం వంటి వాటిని ప్రధానంగా అనుమానిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ప్రమాదం లాల్‌ఖడాన్ సమీపంలో జరిగిందని, ఈ ఢీకొనడం కారణంగా కొన్ని బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రించి, సహాయక చర్యలకు తోడ్పడుతున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి, క్షుణ్ణంగా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
సహాయ పథకాలు, హెల్ప్‌లైన్ నంబర్లు..
ప్రమాదం అనంతరం రైల్వే శాఖ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది. గాయపడిన వారి వివరాల కోసం ప్రయాణికుల కుటుంబ సభ్యులు సంప్రదించవచ్చని తెలిపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 లక్షలు, తీవ్ర గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.
రైల్వే మంత్రిత్వ శాఖ స్పందన
ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే సమీక్ష చేపట్టి, దర్యాప్తు ఆదేశించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. “ప్రాణనష్టం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తాం,” అని రైల్వే మంత్రి పేర్కొన్నారు







