Mahaa Daily Exclusive

  8 లైన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే…

Share

  • 8 లైన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే
  • రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు
  • రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇక విజయవాడ – హైదరాబాద్ విస్తరణ పనులపై కూడా మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్‌-విజయవాడ హైవేను 4 లైన్ల నుంచి 8 లైన్లుగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ రోడ్ల అనుసంధానం కోసం రూ.11,399 కోట్ల విలువైన హ్యామ్‌ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి చెప్పారు.

ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్టు వరకు..
రూ. 8,000 కోట్లతో 52 కి.మీ నిర్మించబోయే మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన దశలో ఉందన్నారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్టు వరకు రూ. 20,000 కోట్లతో కొత్త వాణిజ్య కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలోని రోడ్ల పురోగతిని స్వయంగా సమీక్షిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అనుమతుల కోసం కేంద్ర మంత్రులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు

Latest