- 60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం.
- ప్రతిపాదనలో మరో 28 వేల కోట్ల రూపాయల పనులు
- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రికార్డు
- రహదారుల నిర్మాణంతో బహుళ జాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ
- లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది యువతకు ఉపాధి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మహా : రాష్ట్రాభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఒకేసారి
60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 28 వేల కోట్లతో చేపట్టనున్న మన్ననూరు నుంచి శ్రీ శ్రీశైలం వరకు, ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు. శనివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందని పేర్కొన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని తెలిపారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయన్నారు. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుందని తెలిపారు.
అబ్దుల్లాపూర్ మెట్ ఇండస్ట్రియల్ పార్కు నుంచి విజయవాడ వరకు ఉన్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్ల రహదారిగా విస్తరించనున్నామని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న జాతీయ రహదారిని ఎనిమిది లైన్లుగా విస్తరిస్తున్నామన్నారు, ఇందులో ఆరు లైన్లు ప్రధాన రహదారి కాగా రెండు సర్వీసు రోడ్లని తెలిపారు. రహదారి వెంట ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 10,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 36 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆరు లైన్లుగా నిర్మించబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు అన్ని జిల్లాలను కలుపుతుందన్నారు. ఈ రహదారి నిర్మాణానికి 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణం.హ్యామ్ ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు.
వీటితో పాటుగా అదనంగా మరో రూ. 28 వేల కోట్లతో చేపట్టనున్న పనులు ప్రతిపాదనలో ఉన్నాయని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. రూ. 8 వేల వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుది దశకు చేరాయన్నారు. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే అని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందని తెలిపారు. భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు





