- లౌకికవాద పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్
- నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
- జూబ్లిహిల్స్ ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ సమాజం కోసం పని చేస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసం క్రైస్తవ ప్రతినిధులు సమావేశం కావడం శుభ పరిణామామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, దీవించడం కోసం ఇక్కడకు వచ్చిన పాస్టర్లకు క్రైస్తవ సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం, వారిని ముందుకు నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అజేయంగా నిలవాలని ప్రార్థనలు చేయడంతో పాటు ఆశీస్సులు అందిస్తున్నారని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం మీ ప్రార్థనా మందిరాలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఈ క్యాబినెట్ మొత్తం కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ సమాజ హితం కోసం ప్రజా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. ఈ సమాజానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మొత్తం సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అరచేతుల్లో పెట్టి రక్షించుకోవాల్సిన కర్తవ్యం మీ అందరి పైన ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవును గెలిపించి ఈ ప్రభుత్వాన్ని దీవించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ పైనే ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు






