Mahaa Daily Exclusive

  ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి లాభం..

Share

  • ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి లాభం
  • కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను కోరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని

హైదరాబాద్, మహా : జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి ఉపయోగమని, బీజేపీ అసలు గెలవద్దనేది తమ లక్ష్యమని, బీజేపీ, బీఆర్ఎస్ రెండింటిని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహాలతో కలిసి కూనంనేని మాట్లాడుతూ బబీఆర్ఎస్ కు సొంత వ్యూహం లేదని, బీజేపీతో ఘర్షణ ఎందుకనే వైఖరితో ఆ పార్టీకి అనుకూలంగా ముందుకు వెళుతుందని, అందులో భాగంగానే గతంలో కేసులు ఉన్నాయని ఉద్దేశంతో పలు కీలక ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వైఖరిని బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అదే వైఖరిని అవలంబిస్తే సైద్దాంతికంగా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లవుతుందని, అందుకే బీజేపీని, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు నిలకడగా లేవని, అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మార్చుకుంటున్నారని, లౌకిక విధానం, సామ్రాజ్యవాదం, మతపరమైన తదితర అంశాల విషయంలో బీజేపీకి అనుకూలమైన వైఖరిని బీఆర్ఎస్ అవలంభిస్తున్నదన్నారు. శత్రువు శత్రువు మిత్రుడనే సూత్రంతో బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ఏమిటో తెలియదు కానీ అంతర్గతంగా రెండు పార్టీల మధ్య ఏదో స్నేహం ఉన్నట్లు కనబడుతున్నదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మిత్రులయ్యారని, పైకి పరస్పరం వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల మాత్రం రెండు పార్టీలు ఒకటేనన్నారు.

కుట్రలపై ఆధారపడి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న మోదీ
బీజేపీ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాల వల్ల దేశానికి నష్టం జరుగుతున్నదని, మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ఓట్ చోరీని తిప్పికొట్టాలని కూనంనేని పిలుపునిచ్చారు. ఓటర్ల ప్రక్షాళన పేరుతో ప్రజల సార్వత్రిక ఓటింగ్ హక్కుకు భంగం కలిగిస్తున్నదని, బీజేపీకి అనుకూలంగా లేని వారికి ఓటు హక్కును తిరస్కరిస్తున్నారని, ఇలాంటి అనేక అంశాలతో కుట్రలపై ఆధారపడి అధికారం నిలబెట్టుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నాని దుయ్యబట్టారు.

మోదీ వైఖరి గర్హనీయం

పాకిస్థాన్ – భారత్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ ప్రధాని మోదీ దానిని ఖండించకపోవడమే కాకుండా కనీసం స్పందించకపోవడం గర్హనీయమన్నారు. దేశ విధానాలను ప్రభావితం చేస్తున్న ట్రంప్ ప్రకటనలతో తమకు సంబంధం లేదని ఎందుకు చెప్పడం లేదని, అమెరికా విధిస్తున్న టారిఫ్ కు వ్యతిరేకంగా మోడీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. అమెరికా ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వ్యూహాత్మక ఎత్తుగడ అని బీజేపీ ప్రచారం చేస్తుందని, అసలు ఆ ఎత్తుడగ ఏమిటో వెల్లడించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మౌనం వహిస్తూ గతంలో భారత్ ఏర్పాటు చేసుకున్న విదేశాంగ విధానాలను, సాంప్రదాయాలను, పద్ధతులను మంటగలుపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ మోదీ మాట్లాడకపోవడం అన్యాయమఅన్నారు. మరోవైపు అమెరికాలో భారత విద్యార్థుల భవిష్యత్తును ట్రంప్ ఆగమాగం చేస్తున్నారని, అక్రమ వలసల పేరుతో భారతీయులకు బేడీలు వేసి పంపి అవమానించినా మోదీ మాట్లాడడం లేదని విమర్శించారు. న్యూయార్కులో మమ్మాదను ఓడించాలని ట్రంప్ పాటు బిల్ క్లింటన్ లాంటి వారు కూడా ప్రయత్నించినప్పటికీ, జాతి అహంకారానికి, దేశ, ప్రాంతీయ అహంకారానికి వ్యతిరేకంగా మమ్మాద గెలవడం ద్వారా మంచిని గెలిపిస్తారని అక్కడి ప్రజలు రుజువు చేశారన్నారు.

కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరుగుతున్నది

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాధాన్యత నిత్యం పెరుగుతున్నదని, నేపాల్ లో 11 కమ్యూనిస్టు పార్టీలు ఒకటయ్యాయని, ఇది మంచి సంకేతమని, భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నామని కూనంనేని అన్నారు. శ్రీలంకలో కూడా ప్రజలు వామపక్షాల వైపు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా వామపక్ష కమ్యూనిస్టు జండాలు ఎగురుతున్నాయన్నారు..

మావోయిస్టులకు విజ్ఞప్తి

“కొంతమంది మావోయిస్టులు మంచి ఉద్దేశంతో లొంగిపోతున్నారు. ఇది మంచి సమయం. ఇప్పటికీ మావోయిస్టుల పట్ల ప్రజలకు అభిమానం ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ, అనంతరం పునర్ విమర్శ చేసుకుని సాయుధ పోరాటాన్ని విరమించింది. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులను అత్యంత భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. మావోయిస్టులు కూడా మంచి ఆలోచన చేసి సాయుధ పోరాటాన్ని విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం, మావోయిస్టుల త్యాగాలు వృధా కావద్దు. అందరం కలుద్దాం. అందరం కలిస్తే దేశానికి మంచి జరుగుతుంది” అని కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల గొంతు నులుముతున్నదని, కొంతమంది లొంగిపోతున్నారన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, కానీ కమ్యూనిజాన్ని రూపుమాపడం ఆయన తరం కాదని స్పష్టం చేశారు

Latest