- బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్
- నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది
- సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉంది
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ, మహా: మొదట్లో నక్సల్‌కు ప్రజల మద్దతు ఉండేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే, బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. శనివారం బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెంకయ్య నాయుడు వెళ్లి కలిశారు. అనంతరం మీడియాతో వెంకయ్య నాయుడు మాట్లాడారు. భారత రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి, ఉక్కు మనిషి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు ఈరోజు అని తెలిపారు. ఎల్కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి తాను ఢిల్లీ వచ్చానని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. ఎల్కే అద్వానీ క్రౌడ్ పుల్లర్‌గా ఉండే వారని అభివర్ణించారు. 2014లో నరేంద్రమోదీ శకం మొదలు పెట్టాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అప్పటికే గుజరాత్ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని తెలిపారు.
అంతరించిపోయే దశకు నక్సల్స్ మూమెంట్..
అమెరికాలో పరిస్థితి దాదాపుగా మారిందని అన్నారు. ఆయా ఎన్నికల్లో భారతీయ సంతతి వాళ్లు గెలుస్తున్నారని తెలిపారు. ఇండియా ఇతర దేశాలతో పోలిస్తే చాలా తెలివైనదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నక్సల్స్ మూమెంట్ దాదాపు అంతరించిపోయే దశకు వచ్చిందని.. ఇది మంచిదేనని చెప్పుకొచ్చారు. నక్సల్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితాను సరి చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది మాత్రమే కాదని.. ఆయా రాజకీయ పార్టీలది కూడా అని సూచించారు. ఓటర్ల జాబితాలో కూడికలు, తీసివేతలు సహజమేనని.. వాటిని రాజకీయ పార్టీలు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు






