- భారీ ఉగ్రకుట్ర భగ్నం
- గుజరాత్లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
- పట్టుబడ్డ వారిలో ఇద్దరు యూపీ వారు కాగా మరొకరు హైదరాబాద్ వాసి
- ఎంబీబీఎస్ పూర్తి చేసిన హైదరాబాద్ కు చెందిన మోహియుద్దీన్
అహ్మదాబాద్, మహా : గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) టీం బృందం మరో ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ లో పట్టుకుంది. పట్టుబడ్డ వారిలో ఇద్దరు యూపీకి చెందిన వారు కాగా ఒకరు హైదరాబాద్ వాసి అని అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందిన ఈ ముగ్గురూ దేశఁలో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వివిధ ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసింది. తాజా అరెస్ట్ ఉగ్రవాద ఏరివేతలో ఓ పెద్ద విజయమని భావిస్తోంది. అదుపులోకి తీసుకున్నవారిపై ఏడాది కాలంగా అధికార బృందాలు నిఘావేసి ఉంచినట్టు ఏటీఎస్ వెల్లడించింది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తో సంబంధముందని పేర్కొంది. నిందితులు దేశంలో ఏదో పెద్ద ఉగ్రకుట్రకే పన్నాగం పన్నినట్లు చెప్పిన ఏటీఎస్.. అందుకోసం వారు ఇటీవల ఆయుధాల మార్పిడి కోసం గుజరాత్లో సంచరించినట్టు తెలిపింది. ఈ ముగ్గురూ ఉగ్రవాదంపై ప్రత్యేక శిక్షణ పొందారని, వారి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని తేల్చింది. వీరంతా రెండు వేర్వేరు సంస్థల ఉగ్ర మాడ్యూళ్లలో భాగమని తెలిపింది. నిందితులపై విచారణ చేపట్టినట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. వీరితో ఇంకెవరికైనా సంబంధాలున్నాయా, వారి ప్రణాళికలేంటి అనే విషయాలు బయటపడే అవకాశమున్నట్టు తెలిపారు. 2024 జులైలో అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో.. ఇద్దరు గుజరాత్ వాసులు కాగా, మరో ఇద్దరు ఢిల్లీ, నొయిడా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వారికి అల్‌ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ మాడ్యూల్తో సంబంధమున్నట్టు తేల్చింది.
హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ (35) ఉన్నారు. ఇతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దీని ఆధారంగా ఆదివారం ఆయన నివాసంలో విస్తృతంగా అధికారులు తనిఖీలు చేశారు. టెలీగ్రామ్ ద్వారా ఐఎస్కేపీ సభ్యులతో మొహియుద్దీన్ చర్చలు జరుపుతున్నాడని నిర్ధారించారు. నిందితుడి నుంచి రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది. కాగా, మొహియుద్దీన్ ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు గుర్తించారు. విచారణలో మొహియుద్దీన్ ఆయుధాలను రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.







