- వరంగల్ ఆస్పత్రి కాంట్రాక్టర్ హరీష్ బినామీ
- గతంలో హరీష్, రేవంత్ కు మధ్య డీల్
- విజిలెన్స్ విచారణలు జరిపించినా చర్యలు తీసుకోవడం లేదు
- ఆయనపై తప్ప అందరిపై కేసులు నమోదవుతున్నాయి
- హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ఆరోపణలు
వరంగల్, మహా: తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేస్తున్న కవిత బీఆర్ఎస్ పై, హరీష్ రావుపై తన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాజాగా వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై కీలక ఆరోపణలు చేశారు. వరంగల్ లో బీఆర్ఎస్ హయాంలో భారీ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ ఆస్పత్రి నిర్మిస్తోంది హరీష్ రావు బినామీనేనని కవిత ఆరోపించారు. విజిలెన్స్ విచారణలు జరిపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. గతంలో హరీష్ రావుకు, రేవంత్ కు మధ్య డీల్ ఉందని కవిత ఆరోపణలు చేశారు. హరీష్ రావుపై తప్ప అందరిపై కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇప్పుడు అవే అనుమానాలను వరంగల్ ఆస్పత్రి విషయంలోనూ వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా బీఆర్ఎస్ లో పని చేస్తే.. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా నన్ను అవమానకరంగా బయటికి పంపించారని, తాను పక్కా పాలిటిక్స్ చేస్తానని ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
పొలిటికల్ గా బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదు..
పాలక పక్షం, ప్రతిపక్షం పని చేయడం లేదు. ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ లో నన్ను ప్రోటోకల్ పేరుతో నిజామాబాద్ కి కట్టడి చేశారని, టీచర్ ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూ 11 వందల నుంచి 1700 కోట్లకు పెంచారని, దీని పై విజిలెన్స్ విచారణ వేసి ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో నేడు పాలకపక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉంది. ప్రజల తరఫున అడిగేటోళ్లు లేరు. అందుకే మేము ఆ పని చేస్తున్నామని కవిత వెల్లడించారు. బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు. పొలిటికల్ గా బీఆర్ఎస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని, ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా అని చెప్పారు.






