గప్ చుప్.. అంతా సైలెంట్
మూగబోయిన మైకులు.. జూబ్లీహిల్స్ ప్రచారానికి తెర
ఈ 11న ఉప ఎన్నిక పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు
407 పోలింగ్ కేంద్రాలు.. అమల్లోకి 144 సెక్షన్
హైదరాబాద్, మహా: కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మెుత్తం ప్రచారంతో హీటెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశాయి. ఏ వీధిలో చూసినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జెండాలతో నేతలు ప్రచారంతో ఊపు తెచ్చారు. ఇక ఎన్నికల సంఘం పెట్టిన గడువు ప్రకారం ఆదివారం సాయంత్రం గంటలు ప్రచారం ముగిసింది. దీంతో మైకులు అన్ని బంద్ అయ్యాయి. ప్రచార గడువు నవంబర్ 9 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే. దీంతో కాలనీలు, బస్తీలు, వీధుల్లో గుమిగూడిన రాజకీయ నాయకులు ఇప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇరుకైన సందుల్లో మోగిన మైకుల చప్పుడు వినిపించడం లేదు, సందర్శించే నాయకులు కనిపించడం లేదు. ఇంటింటికి సందర్శనలు, పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా కనిపించిన జూబ్లీహిల్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. రోడ్‌షోలు, పార్టీ అగ్ర నాయకుల ప్రసంగాలు, పార్టీల మధ్య బల ప్రదర్శన సాయంత్రం 5 గంటలతో అయిపోయింది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పుడు ఆంక్షలు మొదలు అయ్యాయి.
407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. మరో 55 మంది అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. మెుత్తం 401365 ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన కేంద్రాల్లో భద్రతను పెంచుతారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మరోవైపు పోలింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించింది. దీంతో సాయంత్రం 6 గంటల దాకా ఓటు వేయవచ్చు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ ముందురోజు ఈ నెల 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, ఆఫీసులకు మాత్రమే సెలవు ఇవ్వగా.. పోలింగ్ రోజు 11వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆఫీసులకు, సంస్థలకు సెలవు ఇచ్చారు. 14 వ తేదీన కౌంటింగ్ జరగనున్నది.
==============






