Mahaa Daily Exclusive

  ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు..! రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Share

  • రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
  • అంగన్‌వాడీల్లో ఇకపై ప్రతిరోజూ పిల్లలకు పంపిణీ
  • పోషకాహార లోపరహిత తెలంగాణగా తీర్చిదిద్దుదాం: మంత్రి సీతక్క

 

ములుగు, మహా: ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలను ప్రతిరోజూ అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోపరహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, అందులో భాగంగానే ఎక్కువగా వెనుకబాటు తనంతో ఉన్న మన ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని తెలిపారు. ముఖ్యంగా తల్లితండ్రులను కలిసి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు.

 

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు..

అలాగే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బాల్య వివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అని, కావున బాల్య వివాహాలను అడ్డుకొని ములుగును బాల్యవివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPO లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, ఐటీడీఏ పీఓ మిశ్రా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

Latest