- రహదారులకు అడ్డుగా నిర్మించిన భారీ భవనాల కూల్చివేత
- హైకోర్టు ఆదేశాల మేరకు రహదారులను పునరుద్ధరించిన హైడ్రా
హైదరాబాద్, మహా: శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్సీఐ) లే ఔట్లో రహదారులు, పార్కులను పట్టించుకోకుండా.. చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. 40 ఫీట్ల రహదారిపై అడ్డంగా ఐరన్ ఫ్రేమ్తో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని తొలగించి రహదారిని క్లియర్ చేసింది. అలాగే 40 ఫీట్ల రహదారిని పట్టించుకోకుండా.. నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది. మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి.. మార్గం సుగమం చేసింది. 40 ఫీట్ల రహదారిని కలిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్ను కూడా పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన 40 వరకూ ఉన్న ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించి మార్గాలను క్లియర్ చేసింది. 40 ఫీట్ల రహదారిపైకి జరిగి నిర్మించిన ఆసుపత్రి భవనం సెల్లార్ ర్యాంపులను హైడ్రా సోమవారం తొలగించింది. ఇలా మొత్తమ్మీద 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. రహదారుల హద్దులను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు..
గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ (ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు గత మంగళవారం తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్ లో 162 వరకూ ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు నావనే ఉద్దేశంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. ఒకసారి లే ఔట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతంలో ఆక్రమణలు తొలగించడంపై సంధ్యాశ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇదే కేసులో బాధిత ప్లాట్ యజమానులు కూడా కోర్టుకు వారి గోడును విన్నవించుకున్నారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే ఔట్లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వెంటనే రహదారులను పునరుద్ధరించాలని కోర్టు పేర్కొంది. దీంతో సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంది.
20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 162 ప్లాట్లతో..
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట 1980లో 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 162 ప్లాట్లతో లే ఔట్ వేశారు. దాని నామ రూపాలు లేకుండా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు చేశారంటూ హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. ‘సంధ్యా కన్వెన్షన్ పేరిట అడుగుపెట్టి పక్కనే ఉన్న మా లే ఔట్ను కబ్జా చేశారు. కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల చిరునామా లేకుండా.. మొత్తం హద్దులను చెరిపేశారు. లే ఔట్లో రహదారులు, పార్కుల ఆనవాళ్లు లేకుండా ఆక్రమించేశారు. ఇదేమని అడిగితే తమపైనే దాడులు చేశారు. ఈ మోసాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒకటా రెండా.. 30 వరకూ కేసులు ఆయనపై పలు పోలీసు స్టేషన్ లో నమోదయ్యాయి. తమ లే ఔట్కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. హైడ్రా రావడంతో మాకు ధైర్యం వచ్చింది. మీరైనా చర్యలు తీసుకోండి “ అని లే ఔట్లోని పలువురు ప్లాట్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రాకు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడ్డాయి. అక్కడ లే ఔట్ నామరూపాలు లేకుండా కబ్జాలు జరిగాయని.. పలునిర్మాణాలకు అనుమతులు లేవని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు అధికారులు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం విధితమే. అయినప్పటికీ సంధ్యా శ్రీధర్ రావు ధోరణి మారలేదు. నిర్మాణాలు కొనసాగించడంతో సోమవారం మరోసారి ఆక్రమణలకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా తొలగించింది.







