- భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి
- పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలి
- అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
- మల్లన్న జాతర, కళ్యాణం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్, మహా: సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. సోమవారం సెక్రటేరియట్‌లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం కంటే ముందు మల్లన్న జాతర, కళ్యాణం పోస్టరును మంత్రి సురేఖ రిలీజ్ చేశారు. రివ్యూ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జాతర, కల్యాణం నిర్వహించిన సమయంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అవి రాకుండా చూడాలని సూచించారు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని, జనవరి 18 నుండి 10 వారాలపాటు మార్చి 16 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్యాణాన్ని వీక్షించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యేందుకు వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్ ను నిర్దేశించారు.
కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలి..
గత సంవత్సరం జరిగిన జాతర, కళ్యాణం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఎండోమెంటు అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనులపై మంత్రి సురేఖ వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కల్యాణోత్సవానికి, జాతరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పరిస్థితులున్నందున ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిద్దపేట డిపో మేనేజర్‌కు మంత్రి సురేఖ సూచించారు. భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపు, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను విస్తృతంగా జనంలోకి వెళ్ళేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఆలయ ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరి..
భక్తులకు సాయపడేలా అవసరమైన చోట వాలంటీర్లు, ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకునేలా కార్యాచరణను రూపొందించాలని సూచించారు. స్వామివారి ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరుగుతున్నన్ని రోజులు సాయంత్రాల్లో కళాబృందాలచే ఒగ్గుకథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా వుండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. కల్యాణంతో పాటు, జాతర జరిగినన్ని రోజుల దేవాలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయడంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.







