Mahaa Daily Exclusive

  42 మంది సజీవ దహనం..! సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం..

Share

  • సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం
  • భారతీయ యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్‌ ట్యాంకర్‌
  • అక్కడికక్కడే మంటల్లో 42 మంది సజీవం.. ఒకే ఒక్కడు సేఫ్
  • ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృత్యువాత
  • మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం.. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు

సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, మంత్రులు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

 

హైదరాబాద్, మహా: సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో అందరూ హైదరాబాద్‌ వాసులే. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారుు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ఉండగా, ఒకరు మాత్రం ప్రాణాలతో బయపడ్డారు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినపుడు ఎక్కువ మంది గాఢనిద్రలో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సౌదీ అధికారులు, రక్షణ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చామని అధికారులు వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో అధికారులు నిమగ్మమై ఉన్నారని సౌదీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడినట్లుగా తెలుస్తోంది.

 

ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి..

ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) కాగా.. ఇతను హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో షోయబ్ బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నందున ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. అయితే షోయబ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 

ఒకే కుటుంబంలో 18 మంది మృతి..

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. నసీరుద్దీన్‌ ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబళించింది. విషయం తెలుసుకున్న నసీరుద్దీన్‌ బంధువులు, స్నేహితులు అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

 

 

ముఖ్య వివరాలు..

బస్సులో 42 మంది. అందరూ హైదరాబాద్ నివాసులు.

42 మంది (31 మంది పెద్దలు, వీరిలో 20 మంది మహిళలు; 11 మంది చిన్నారులు).

కొంత మంది తీవ్ర గాయాలతో మదీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు..

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్, యాత్రికుల బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు. మొత్తం మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ యాత్రికులు కొందరు ఉన్నట్టు తెలియడంతో సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, తెలంగాణ నుంచి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి చర్యలు చేపట్టారు.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్లు..

వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044

సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143.

రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157.

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ..

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిని గుర్తించాలని, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణ సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది, తద్వారా కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 

మోదీ దిగ్భ్రాంతి..

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రియాద్‌, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.

 

స్పందించిన విదేశాంగ మంత్రి..

ఈ దుర్ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

 

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మృతులకు సౌదీ అరేబియాలో వారి మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రతి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి నుండి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మైనారిటీ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఎంఐఎం నుండి ఎమ్మెల్యే, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారితో కూడిన అధికారిక ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Latest