- ఓట్ చోరీతో రాజ్యాంగానికి తూట్లు
- బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికం
- అధికార పరమావధిగా మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు
- కాంగ్రెస్ మహా నిరసన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
- దేశవ్యాప్తంగా ఓటు చోరీపై నిరసనలు ఉద్ధృతం చేయాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, మహా: బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలన్నారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధముగా ఉందని కొనియాడారు. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓటు విలువ తెలియక ఉండటం శోచనీయమన్నారు. బీహార్ ఎన్నికల్లో సామాన్యులకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఓటు శాతం తక్కువగా వచ్చి ఎన్డీయే సీట్లు గెలవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీహార్‌లో ఓట్ చోరీతో ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీహార్ లో ఎన్డీయే కూటమికి సీట్లు గెలుచుకుందన్నారు. దేశ భవిష్యత్ కి విఘాతం కలిగించే విధంగా ఓట్ చోరీ ఉందన్నారు.
బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్‌గా ఈసీ..
ఓట్ శతం మహాఘాట్ బంధన్ కి ఎక్కువ వస్తే.. సీట్లు ఎన్డీయే కూటమికి సీట్లు పెరిగాయని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సెక్యులర్ ఓట్లను తొలగించి ఓట్ చోరీతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరు తెన్నులు శోచనీయమన్నారు. బీజేవైఎంలాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని చేస్తుందని, దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది.. అధికార పరమావధిగా మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారన్నారు. బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికమని కామెంట్స్ చేశారు. ఓట్ చోరీ గురించి 8 ఏళ్ల క్రితమే పోరాడామని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తుందని, నేటి నుంచి తెలంగాణలో ఓట్ చోరీ సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుందని, తెలంగాణలో సర్ పేరిట ఓట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ ఛీప్ వ్యాఖ్యానించారు.
ఓటుచోరీపై నిరసనలు ఉద్దృతం చేయాలి: మంత్రి పొన్నం
బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరీకి పాల్పడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శక్తివంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ఓటుచోరీపై నిరసనలు ఉద్దృతం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పారు.






