Mahaa Daily Exclusive

  హరీశ్ రావునే టార్గెట్ చేసిన కవిత..!

Share

  • హరీశ్ రావునే టార్గెట్ చేసిన కవిత..!
  •  వందిమాగధులు’ అంటూ ఫైర్!
  •  ఆరోపణలకు హరీశ్ రావే సమాధానం చెప్పాలి.
  •  ఇతరులతో తిట్టిస్తే కుదరదు’
  •  జూబ్లీహిల్స్ గెలుపుపై ప్రతిపక్షాలపై విమర్శలు.
  •  కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యమే.
  •  ఖమ్మం పర్యటనలో కవిత కీలక వ్యాఖ్యలు.

 

ఖమ్మం బ్యూరో, మహా.

 

నెలల తరబడి కొనసాగుతున్న బీఆర్ఎస్ అంతర్గత రాజకీయ సంక్షోభం తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది. ఆమె మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

** హరీశ్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు**

 

‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, సత్తుపల్లి, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించిన కవిత, తనపై వస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వడంపై స్పందించారు. హరీశ్ రావు మీద ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా వివరణ ఇవ్వాలి తప్ప, ప్రతిసారి “వందిమాగధులు” తమ తరఫున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదన్నారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతారా లేదా అని ప్రజలు గమనిస్తారన్నారు. “పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారు,” అని పరోక్షంగా హరీశ్ రావు వైఖరిని దుయ్యబట్టారు. ఈ అంశాలపై రేపు మీడియా సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడుతానని ఆమె ప్రకటించారు.

 

**జూబ్లీహిల్స్ గెలుపుపై ప్రతిపక్షాల వైఫల్యం**

 

ఇక, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం అనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత ఆరోపించారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలత ఉంటుందని అంగీకరిస్తూనే, కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని, ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదని గ్రామాల్లో ప్రజలు విమర్శిస్తున్నారని ఆమె తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ స్పష్టంగా విఫలమయ్యాయని అర్థమవుతోందని ఆమె దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై చేయాల్సినంత పోరాటం ఆ పార్టీలు చేయటం లేదని, అందుకే ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తన భుజాన వేసుకుందని కవిత వివరించారు.

 

**ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శ.**

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకునే ఉద్దేశంతోనే జాగృతి ఆధ్వర్యంలో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ, యాసంగిలో రైతులు పండించిన పంటకు సంబంధించిన ధరకే డబ్బులు ఇప్పటికీ వారి అకౌంట్లలో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం పంట కూడా వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించి రైతులకు ఉపశమనం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నేపథ్యంలో రైతుల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రూ. 500 బోనస్‌ను కూడా ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

అనంతరం టేకులపల్లిలోని గురుకుల పాఠశాలను కవిత సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు రావడం, బాలికల పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడం, కొంతమంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తమ దృష్టికి చేరినట్లుగా ఆమె తెలిపారు. ఈ అంశాలన్నింటిని జిల్లాలోని ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని, సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Latest