- పార్టీ కోటా ఫైనల్
- పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఖరారు
- డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు
- మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం
- కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం
- పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ తెలంగాణ గీతం, ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌కు దామోదర్‌రెడ్డి పేరు
- కేబినెట్ నిర్ణయాలు మీడియాకు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మహా: రాష్ట్రంలో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదించినట్లు చెప్పారు. అంతేకాకుండా గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ‘ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని నిర్ణయించింది. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం. అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేస్తాం. పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ రాసిన తెలంగాణ గీతం పెడతాం. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. పార్టీ పరంగానూ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మొదట గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. అప్పటిలోగా ఎన్నికలు పూర్తికాకపోతే.. గ్రామాలకు రావాల్సిన దాదాపు రూ.3వేల కోట్ల నిధులు కోల్పోతాం.
ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌కు దామోదర్‌రెడ్డి పేరు..
హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్ల పరిధికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. అయితే, కోర్టులో కేసులు పడటంతో ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచి పోయింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్2 మెయిన్ కెనాల్‌కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీకి ఆమోదం..
ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన ‘ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది’’ అని పొంగులేటి పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.






