Mahaa Daily Exclusive

  ఏపీలో ఎదురు కాల్పులు… మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి…

Share

  • ఏపీలో ఎదురు కాల్పులు
  • మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి
  • అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్
  • మడావి హిడ్మా, ఆయన భార్య రాజె సహా ఆరుగురు మావోయిస్టులు మృతి
  • విజయవాడలో 26 మంది మావోయిస్టుల అరెస్టు
  • ఏలూరులో మరో 11 మంది పట్టివేత
  • పట్టుకున్న వారిలో 11 మంది దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు
  • ఆటో నగర్ ను జల్లెడ పట్టిన ఆక్టోపస్ బలగాలు
  • అయిదు గంటల పాటు సాగిన ఆపరేషన్

విజయవాడ, మహా : మావోయిస్టు పార్టీకి బారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకాలం మావోయిస్టు ఉద్యమానికి కీలకుడైన హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన బార్య కూడా పోలీసులు కాల్పుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ నేత మడావి హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లో కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతుండటంతో మావోయిస్టులకు చెందిన కొందరు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ లోని దండకారణ్యంలోకి ప్రవేశించారని పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉంది. దీంతో ఏపీ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు నిఘాను తీవ్రం చేశాయి. ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి మండలంలోని అడవుల్లో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పోలీసులు గాలింపును ముమ్మరం చేయగా మావోయిస్టులు తారసపడ్డారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు – మావోయిస్టుల కాల్పులు జరుగగా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.

మృతి చెందిన హిడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా, ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్​గా కొనసాగుతున్నారు. ఘటనాస్థలిని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి పరిశీలించారు. పీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎదురు కాల్పులలో మృతి చెందిన మావోయిస్టులు: హిడ్మా(సెంట్రల్‌ కమిటీ సభ్యుడు), హిడ్మా భార్య మడకం రాజే అలియాస్‌ రాజక్క (డివిజన్ కమిటీ మెంబర్‌), చెల్లూరి నారాయణ అలియాస్‌ సురేశ్‌, టెక్ శంకర్‌, మల్లా, దేవే మృతిచెందారు.

భద్రతా బలగాలు ఆపరేషన్‌ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. హిడ్మా కోసం గత నెలరోజులుగా భారీ కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల్లో ఉన్న మిగిలిన కీలక నేతల కోసం కూడా గాలిస్తున్న భద్రతా బలగాలు తెలిపాయి. హిడ్మా మృతితో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయని చెప్పవచ్చు.

హిడ్మా అలియాస్ సంతోష్ నేపథ్యం ఇదే

హిడ్మా ఛత్తీస్​గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించారు. 30 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరారు. బస్తర్, దంతేవాడ దళంలో కీలక సభ్యుడిగా హిడ్మా ఎదిగారు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా చేసి “గెరిల్లా దాడుల వ్యూహకర్త”గా ఆయన పేరొందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేసిన హిడ్మా గత 2 దశాబ్దాల్లో జరిగిన మావోయిస్టు కీలకదాడులకు సూత్రధారిగా గుర్తింపు పొందారు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు ఈయనే నేతృత్వం వహించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు హిడ్మా పై రూ.6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి.

సుక్మా జిల్లాలోనూ ఎదురు కాల్పులు

మరోవైపు ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు – భద్రతా బలగాల మద్య జరగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్​ తెలిపారు.

దృవీకరించిన ఇంటెలీజెన్స్ ఏడీజీ

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్​చంద్ర లడ్హా తెలిపారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని అన్నారు. “మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈరోజు ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీనితో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మెుత్తం 27 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. కాల్పుల్లో మరణించిన ఆరుగురు మావోయిస్టులలో మడావి హిడ్మాతోపాటు ఆయన భార్య రాజె కూడా ఉన్నారని మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. అంతకుముందు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా తెలిపారు.

ఎవరీ హిడ్మా?

బక్కపల్చగా కనిపించే ఈ మావోయిస్టు నేత, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతారు. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు. తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే.

హిడ్మాను 2000వ సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు. ఆయుధాల తయారీ, రిపేర్లు చేసేవాడు. గ్రనేడ్లు, లాంఛర్లు స్థానికంగా తయారు చేయించాడు” అని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు ఒకరు గతంలో తెలిపారు కూడా. 2001 – 02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో ఎదిగారు హిడ్మా. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరారు. 2001-2007 మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. కానీ బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుం ఎదుగుదల, హిడ్మా మరింత యాక్టివ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిందంటున్నారు మావోయిస్టు కార్యకలాపాలను విశ్లేషించిన వారు. 2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు.
మావోయిస్టులను మందుపాతరల నుంచి తుపాకులవైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు. ”నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కూడా ఆయన ఆ దూకుడును కొనసాగించాడు. అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది” అని ఒక మాజీ మహిళా మావోయిస్టు గతంలో చెప్పారు. 2008 – 09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్ అయ్యారు హిడ్మా. ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. తరువాత 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యారు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు. 2011 ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో హిడ్మా గురించి ఆసక్తికర చర్చ జరిగిందని అప్పట్లో మావోయిస్టు పార్టీలో ఉండి తరువాత బయటకు వచ్చిన ఒక మావోయిస్టు చెప్పారు. ఆ చర్చ ఆయన పోరాట శైలి గురించి. హిడ్మా అనేక పోరాటాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్నా, స్వయంగా తూటాలు పేల్చేది తక్కువ. దగ్గరుండి మిగిలిన మావోయిస్టులను నడిపిస్తారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప తన దగ్గరున్న తుపాకీ ఉపయోగించరు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పని చేస్తుంది. అలాగని ఆయన యుద్ధ భూమికి దూరంగా ఉండరు. పక్కనే ఉండి నడిపిస్తారని ఆ మాజీ మావోయిస్టు ఒకరు హిడ్మా గురించి చెప్పారు.

ఇంకా విచిత్రం ఏంటంటే 2012 వరకూ హిడ్మాకు ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. అన్ని వేల బుల్లెట్ల పోరాటంలో అతనున్నా, చిన్న గాయం కాకుండా ఉండడం విచిత్రమైన విషయం. 2012 తరువాత అతనికి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది ఎవరికీ తెలియదు. ‘‘బస్తర్ స్థానికుడు హిడ్మా. అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. స్థానికులతో కలిసిపోతారు. వారితో సత్సంబంధాలు ఉంటాయి. అతనికి స్థానిక యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. అక్కడి వారు అతణ్ణి ఓ దేవుడిలా చూస్తారు” అని దండకారణ్యం వార్తలు కవర్ చేసిన ఒక విలేఖరి చెప్పారు. ‘‘ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవడం ఆయనకు అలవాటు” అని హిడ్మా గురించి చెప్పారాయన. ”హిడ్మా విదేశాల్లో శిక్షణ పొందారన్నది తప్పు. నాకు తెలిసినంత వరకూ ఆయన ఎప్పుడూ ఏ పెద్ద నగరమూ చూసి ఉండరు. ఆయన బస్తర్, దండకారణ్యం దాటి ఉండకపోవచ్చు. అసలు మెయిన్ రోడ్లపై హిడ్మా ప్రయాణించిన దాఖలాలు కూడా లేవు” అన్నారాయన.

మారేడుమిల్లి డైరీ ఆదారంగా

విజయవాడలో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న ఆక్టోపస్ బలగాలు

మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళారం వేకువజామునే కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు సమాచారం ఉండయంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు.. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్టు సమాచారం. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

హిడ్మా ఎన్ కౌంటర్ భారత ప్రభుత్వ భారీ విజయం

నక్సల్ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా మంగళవారం భద్రతా బలగాల చేతితో హతమయ్యాడు. అతడి ఎన్‌కౌంటర్ నక్సల్స్ ఏరివేతలో ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. మావోయిస్ట్ పార్టీకి మూలస్తంభంగా ఉన్న హిడ్మా నేలకూలడంతో మావోయిస్ట్ పార్టీ కూడా రేపో మాపో కనుమరుగవ్వొచ్చన్న చర్చ మొదలైంది. నక్సల్స్ రహిత భారత్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించింది. మావోయిస్ట్‌లు లొంగిపోవాలని, లేకపోతే వారికి మరణం తథ్యమని అనేక సందర్భాలలో కేంద్రంలోని పెద్దలు పలువురు హెచ్చరించారు. అంతేకాకుండా లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వందల మంది మావోయిస్ట్ నేతలు లొంగిపోగా.. మరికొందరు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బండి ప్రకాష్ ఇలా చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే హిడ్మాను కూడా లొంగిపోవాలంటూ అతని తల్లిచేత ఓ వీడియో చేయించారు అధికారులు. కానీ హిడ్మా లొంగిపోలేదు. ఆంధ్రప్రదేశ్ అల్లూరిసీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అధికారులు చేపట్టిన కూంబింగ్‌లో మంగళవారం మరణించాడు.

కర్రెగుట్టలో గాలింపులు.. ఏపీలో మకాం..

అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కోసం ప్రభుత్వ భద్రతా బలగాలు చాలా కాలంగా వెతుకుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. పలువురు మావోయిస్ట్ నేతలు వారి చేతుల్లో హతమయ్యారు. మరికొందరు పోలీసులు ముందు ఆయుధం వీడారు. కానీ హిడ్మా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్‌ పర్వతాలు, నేషనల్‌ పార్కు ప్రాంతం వరకూ భారీ ఆపరేషన్లు జరిగాయి. ఆ సమయంలో హిడ్మా తాజా ఫోటో బయటకు రావడం అతడి ప్రాంతాన్ని గుర్తించడంలో కీలకంగా మారింది. అయితే హిడ్మా కోసం భద్రతా బలగాలు కర్రెగుట్ట దండకారణ్యంలో ముమ్మరంగా గాలింపులు చేస్తున్నాయి. దీంతో అతడు ఏపీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లో కూంబింగ్ జరిగి, మావోయిస్ట్‌లప దాడులు జరిగి చాలా కాలం అయింది. ఆపరేషన్ కగార్ ప్రభావం కూడా ఏపీ అడవుల్లో లేదు. అందుకే హిడ్మా.. ఒడిశా మీదుగా ఏపీ మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చి ఉండొచ్చని వాదన వినిపిస్తోంది. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడం కోసమే హిడ్మా.. ఏపీకి చేరుకొని ఉండొచ్చని, ఏపీలో కూబింగ్ కూడా జరుగకపోవడం వల్లే ఏపీ బెస్ట్ చాయిస్ అని హిడ్మా అనుకుని ఉండొచ్చని సమాచారం.

ఉప్పందించింది ఎవరు ?

ఎవరికీ తెలియకుండా హిడ్మా ఏపీకి చేరుకుంటే అసలు అతడు అక్కడ ఉన్నాడని పోలీసులకు ఉప్పందించింది ఎవరూ. చాలా అడవుల్లో కూంబింగ్ చేయని ఏపీ పోలీసులు మంగళవారం అకస్వాత్తుగా ఎందుకు కూంబింగ్ చేశారు. హిడ్మా అక్కడ ఉన్నాడని సమాచారం రావడంతోనే పోలీసులు కదిలారా? అదే నిజమయితే హిడ్మా సమాచారాన్ని ఎవరు అందించి ఉంటారు? అన్న ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఇంకా చాలా మంది కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశన్న లాంటి నాయకుడు ఎవరైనా లొంగిపోదలుచుకుంటే తనను కాంటాక్ట్ చేయాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే లొంగిపోవాలని అనుకుంటున్న నేతలు లొంగిపోయిన నాయకులకు హిడ్మా సమాచారం ఇచ్చారని, వారి నుంచే అధికారులకు చేరిందని వాదన వినిపిస్తోంది. అత్యంత కీలక నేత అయిన హిడ్మా ఉన్నాడని సమాచారం రావడంతో ఏపీ పోలీసులు, భద్రతా బలగాలు హుటాహుటిన మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్ చేపట్టాయని, హిడ్మాను హతం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ మైండ్ గేమ్ ఫలించిందా..?

కొన్ని రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ పూవర్తి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లి మాడ్వి పూంజితో మాట్లాడారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగానే హిడ్మాను ఆయుధం వీడి జనజీవ స్రవంతిలో కలవాలని ఆమె కోరారు. కాగా అదంతా కూడా హిడ్మాను ఎలిమినేట్ చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న మైండ్ గేమ్ అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించడంతో ప్రభుత్వ మైండ్ గేమ్ ఫలిచిందన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ గేమ్ సక్సెస్ అయిందా? లేదంటే హిడ్మా ఏదైనా పొరపాటు చేశాడా? అని కూడా కొందరు చర్చిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తన టార్గెట్‌ను రీచ్ అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

హిడ్మా అంత కీలకం ఎందుకు..?

మావోయిస్ట్‌లు చేసిన అత్యంత కీలక మిషన్‌లలో హిడ్మా అత్యంత ప్రధాన పాత్ర పోషించాడు. జవాన్లు, కీలక నేతలపై చేసిన దాడులకు వ్యూహాలు రచించడం, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడంలో హిడ్మా కీలకంగా వ్యవహరించారు. గెరిల్లా స్టైల్‌లో హిడ్మాది అందెవేసిన చెయ్యి. అందుకే పలు కీలక మిషన్‌లకు అతడు నాయకత్వం వహించాడు. హిడ్మా ప్రణాళికలు భద్రతా బలగాలకు భారీ నష్టం కలిగించినప్పటికీ, మావోయిస్టుల వైపు మాత్రం తక్కువ ప్రాణనష్టం ఉండేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అతడే తన బెటాలియన్‌కు యుద్ధ వ్యూహాలు, గెరిల్లా పద్ధతులు నేర్పే బాధ్యత తీసుకున్నాడు. సీఆర్పీఎఫ్ శిబిరాలు, పోలీసు కూంబింగ్‌ బృందాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడంలో అతడి ప్రణాళికలు కీలకంగా మారాయి. పరిశోధన–అభివృద్ధి విభాగం కూడా అతడి పర్యవేక్షణలో పనిచేసేది.

* 2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు

* 2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు

* 2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్‌ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర

* 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చాడు

* 2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు

మావోయిస్ట్ పార్టీ పని అయిపోయినట్లేనా..!

హిడ్మా మరణంతో మావోయిస్ట్ పార్టీ పని అయిపోయిందన్న చర్చ అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరుగా కేంద్ర కమిటీ సభ్యులు పార్టీని వీడి అధికారుల ముందు లొంగిపోతున్నారు. మల్లోజుల, ఆశన్న, బండి ప్రకాష్ ఇలా చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీని వీడారు. జనజీవన స్రవంతిలో కలవడానికి ఆసక్తి చూపారు. కాగా ఆశన్న తాము లొంగిపోలేదని తమ పోరాటం సమాజం నుంచి చేస్తామన్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీలో హిడ్మానే అత్యంత పెద్ద నాయకుడిగా ఉన్నాడు. కేంద్ర కమిటీ సభ్యులు డేంజరస్‌గా ఉన్న నేత కూడా అతనే.. అతనిపైనే పార్టీ బాధ్యతలు అన్నీ నిలిచాయి. అలాంటిది ఇప్పుడు అతడు కూడా ఎదురుకాల్పుల్లో మరణించడంతో.. మావోయిస్ట్ పార్టీని ముందు నడిపంచే నేత మరొకరు లేరన్న వాదన బలోపేతం అవుతోంది. దీంతో హిడ్మా మరణంతో మావోయిస్ట్ రహిత భారత్‌ వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత ముందడుగు వేసిందన్న చర్చ మొదలైంది.

కేంద్రానికి గొప్ప విజయం..

పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు దశాబ్దాలుగా తలనొప్పిగా మారిన మావోయిస్ట్ నేత హిడ్మా అనడంలో సందేహం లేదు. అతడు అంత పెద్ద సమస్యగా మారడం వల్లే పలు రాష్ట్రాలు కలిపి మొత్తం రూ. 6 కోట్ల వరకు అతడి తలపై రివార్డ్ పెట్టాయి. ఎక్కడ వెతికినా? ఎంత వెతికినా ఇన్నాళ్లూ అతడి ఆచూకి తెలియలేదు. అలాంటిది ఇప్పుడు అతడిని హతం చేయంతో నక్సల్స్‌పై చేస్తున్న ఆపరేషన్‌లో ఇది అత్యంత కీలక అంశంగా, ప్రభుత్వానికి అతిపెద్ద విజయంగా మారింది.

బలమైన నెట్‌వర్క్..

అంతేకాకుండా హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందినవాడు కావడంతో అతడికి అక్కడ అంతా సహాయం చేసేవారు. అందువల్ల అతడు కదిలే ప్రాంతం చుట్టుపక్కల భద్రతా బలగాల కదలికల సమాచారం ముందుగానే తెలిసిపోయేవి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతంలో కార్యకలాపాలు జరపటం అతనికి భద్రతా కోణంలో అనుకూలంగా మారేది. ఏడో తరగతి విద్య మాత్రమే ఉన్నప్పటికీ ఇంగ్లీష్‌ను చక్కగా మాట్లాడగలడని 2015లో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఒక జర్నలిస్ట్‌ తెలిపారు.

హిడ్మా ఎన్‌కౌంటర్ హెచ్చరిక ఏమిటి?

దేశవ్యాప్తంగా మావోయిస్టు దళాల ఉనికిని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుంది. గడువు ముగియడానికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉండగా, అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు మరింత ఉదృతమయ్యాయి. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటం కీలక మలుపు తీసుకుంది.

పచ్చని అడవులు రక్తసిక్తం

వన్యప్రాంతాల్లో డ్రోన్ల గర్జన, హెలికాప్టర్ల చక్కర్లు, అడవుల్లో దళాల అడుగుచప్పుళ్లు…ఇలాంటి ఆపరేషన్లతో ఆపరేషన్ కగార్ దేశంలోని మావోయిస్టు వ్యవస్థను మూలాలతో పాటు కూల్చేస్తోంది.ఆపరేషన్ కగార్ లక్ష్యం కింద మావోయిస్టులు లేని ప్రాంతంగా ప్రకటించేందుకు మరో నాలుగు నెలల పది రోజుల సమయం మాత్రమే ఉంది.దీంతో కేంద్ర భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతకు కుంబింగ్ ను ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది మార్చికల్లా నక్సల్స్ ఫ్రీ దేశంగా ప్రకటిస్తామని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులను మట్టు పెట్టడంలో రెండు తెలుగురాష్ట్రాల్లో ఏర్పాటైన గ్రేహోండ్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు సమర్థంగా పనిచేస్తున్నాయి.

హోం శాఖ ఆపరేషన్ కగార్

దేశంలో మావోయిస్టులను మట్టుపెట్టడం ద్వారా మావోయిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ ను చేపట్టింది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. గత ఏడాది నుంచి చేపట్టిన ఈ ఆపరేషన్ తో గుట్టల్లో తుపాకులు గర్జిస్తుండగా, పచ్చని అడవులు నెత్తుటితో ఎరుపెక్కాయి.

14 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యానికి చెక్

దేశంలోని ఛత్తీస్ గడ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యానికి కేంద్రాలుగా ఉండేవి. దీంతోపాటు దేశంలోని 14 రాస్ట్రాల్లో మావోయిస్టులు మనుగడ సాగిస్తున్నారని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు. మావోయిస్టులు అధికంగా ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అడువుల్లో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 250 సీఆర్ పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. మావోయిస్టులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం, తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఇతర డంప్ లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారు కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరిపి వారిని మట్టుపెట్టడం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ సాగింది. 2010వ సంవత్సరంలో నేపాల్ దేశంలోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి దాకా 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల రెడ్ కారిడార్ కు నేడు అంతర్థానం అవుతోంది.

సాయుధ పోలీసుల వరుస దాడులు

ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో శత్రుదుర్భేద్యంగా ఉన్న దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులున్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ, ఆంథ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేపట్టాయి. అబూజ్ మడ్ అడవుల్లో మకాం వేసిన మావోయిస్టుల ఆచూకీని డ్రోన్లను ఎగురవేస్తూ, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ భద్రతా బలగాలు కనుగొంటున్నాయి. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అబూజ్ మడ్ అడవుల్లో కేంద్ర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసులతో రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఆయువు పట్టు అయిన స్థావరాలపై సాయుథ పోలీసులు వరుస దాడులు చేస్తూ మావోయిస్టులను మట్టుపెడుతున్నాయి. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడం, మరో వైపు ఎన్ కౌంటర్లతో వారి ప్రాబల్యం తగ్గిపోయిందని తెలంగాణ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు.

ఒకవైపు ఎన్ కౌంటర్ లు…మరో వైపు లొంగుబాట్లు

ఆపరేషన్ కగార్ గడవు సమీపస్తున్న నేపథ్యంలో ఒక వైపు వరుస ఎన్ కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించగా, మరికొంత మంది లొంగిపోయారు. ఫలితంగా ఈ ఆపరేషన్ పుణ్యమా అంటూ మావోయిస్టుల దళాలు బలహీనపడ్డాయి. 2025 అక్టోబరు 14 వతేదీన మావోయిస్టు అగ్రనాయకుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి తన అనుచరులైన 61 మంది కేడరుతో గడిచిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు.

తుపాకులు వదిలి

దట్టమైన అడవులున్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోనే 200 మంది మావోయిస్టులు తుపాకులను వదిలి లొంగిపోయారు. 2014వ సంవత్సరంలో 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం కేవలం వందల చదరపు కిలోమీటర్లకే తగ్గిందని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ గణాంకాలే చెబుతున్నాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల్లో నలుగురు ఎన్ కౌంటర్ కాగా, మరో ఇద్దరు లొంగిపోయారు. దీనికితోడు కొత్తగా మావోయిస్టుల రిక్రూట్ మెంట్ లో అటవీ గ్రామాల యువకులు చేరడం లేదు. దీనికి తోడు మావోయిస్టులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదనే విషయాన్ని యువకులు గుర్తించి వారంతా ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని మాజీ ఐఎఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

వరుస లొంగుబాట్లు

మావోయిజాన్ని వదిలి లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వడంతోపాటు వారికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం మంజూరు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 421 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఛత్తీస్ ఘడ్ లో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత సంవత్సరం తెలంగాణలో 49 మంది, ఛత్తీస్ గడ్ లో 32 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.

తెలంగాణ డీజీపీ ముందు సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో మావోయిజానికి స్వస్థి చెప్పి ఇద్దరు మావోయిస్టు సీనియర్లు కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లు ఇటీవల తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. 2025వ సంవత్సరంలో 427 మంది మావోయిస్టులు దళాల నుంచి వచ్చి లొంగి పోయి జనజీవితం గడుపుతున్నారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు.‘‘పోరు వద్దు – ఊరు ముద్దు!’’అంటూ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు.

ఆయుధాలతో లొంగిపోండి : బస్తర్ ఐజీపీ

దండకారణ్యంలో మిగిలిపోయిన మావోయిస్టులు ఇప్పటికైనా ఆయుధాలతో వచ్చి ఆయుధాలతో లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజన్ విజప్తి చేశారు. ఛత్తీస్ ఘడ్ ని బస్తర్ దండకారణ్యంలో మావోయిస్తుల ఏరివేత కార్యక్రమం చివరి దశలో ఉందని, ఆ ఉన్న కొద్దిమంది ప్రభుత్వానికి లొంగిపోతే ప్రాణాలు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎన్నెన్నో ఎన్ కౌంటర్‌లు

2025 నవంబర్ 17 న సుక్మా జిల్లా తమల్పాడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ మద్వీ దేవా అలియాస్ జెనివి లిథియా, మరో దళ కమాండర్ పోడియం గంగి మరణించారు. 2025 బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. 2025 జనవరి నెలలో 48 మంది మావోయిస్టులు నేలకొరిగారు. 2025 ఫిబ్రవరిలో 40 మంది, 2025 మార్చి 20వతేదీన 30 మంది ఎదురు కాల్పుల్లో మరణించారు. అడవుల్లో దశాబ్దాలుగా జొరబడ్డ మావోయిజం ఇప్పుడు తన చివరి శ్వాస తీసుకుంటోంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ లొంగుబాట్లు, కేంద్ర–రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో మావోయిస్టు దళాలు బలహీనపడి అస్తమయం దిశగా కదులుతున్నాయి. ‘ఆపరేషన్ కగార్’ గడువు ముగియడానికి ఇంకా నాలుగు నెలలే ఉన్న ఈ దశలో, దేశం మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లు కనిపిస్తోంది.

Latest