- 21న హైవేల దిగ్బంధం
- పంట కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం
- ప్రైవేట్‌తో కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారు
- రైతులు ఎవరూ అధైర్య పడకండి.. మళ్ళీ బీఆర్ఎస్సే వస్తుంది
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్, మహా: ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్నదాతలు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతాంగం ముఖ్యంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని కేటీఆర్‌కు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతన్నలకు ఇచ్చిన హామీలన్నింటిని పక్కన పెట్టిందని, కనీసం పండిన పంటలను అమ్ముకోవడంలో కూడా సహకారం అందించడం లేదని తెలిపారు. రైతులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే ఎందుకు ఈ రోజు అదిలాబాద్ మార్కెట్ యార్డ్‌ని బంద్ పెట్టారు. మార్కెట్ యార్డులో రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించింది. చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణంగా పత్తి కొనుగోలు సోయా రైతుల పరిస్థితి మారింది. కిసాన్ కపాస్ మొబైల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారు. మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాలి అని కేటీఆర్ అడిగారు.
ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై..
రాష్ట్రంలో భారీగా అకాల వర్షాలు పడినందు వలన పత్తి తేమశాతం ఎక్కువగా ఉన్నది. చలి కూడా గతంలో కంటే ఎక్కువగా ఉన్నది అందుకే పత్తిలో తేమశాతం ఉన్నది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20 నుంచి 22 శాతం తేమ ఉన్న పంటను కూడా కొనిపించాము. కానీ ఇప్పుడు కేవలం 12 శాతం తేమ ఉంటే కూడా కొనుగోలు చేయము అని చేతులు ఎత్తేసింది. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరు కనీసం అడిగే వారు కూడా లేరు. కనీసం ఇప్పటిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల పంటను దోచుకుంటున్నది అని అనిపిస్తున్నది. లేకుంటే రైతన్నలకు ఎన్ని సమస్యలు వచ్చిన స్పందించకుండా ఉండదు అని కేటీఆర్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర రూ. 8,100 రైతుకు దక్కాల్సింది కానీ ఐదారు వేలు కూడా దక్కడం లేదు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టారు. కానీ నిన్న జరిగిన క్యాబినెట్లో 50 శాతానికి పైగా తెలంగాణ జిల్లాలో పండుతున్న పత్తి పంట పైన కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సరఫరా నుంచి మొదలుకొని యూరియా సప్లై దాకా చివరికి పంట అమ్మకానికి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో రైతన్నల పంటలు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా లేవు. దేశంలోనే అత్యుత్తమ పంటను పండించే రాష్ట్రం తెలంగాణ కానీ ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టి రైతన్నలను పట్టించుకోవడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు






