Mahaa Daily Exclusive

  గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ…

Share

  • గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ
  • స్పష్టం చేసిన పార్టీ నేతలు
  • ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని శ్రేణులకు సూచన

హైదరాబాద్, మహా : ఏపీలో మహా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన తెలంగాణలో అడుగు పెట్టేందుకు సన్నద్దమైంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రేణులు సన్నద్దం కావాలని ఆ పార్టీ సంకేతాలను ఇచ్చింది. అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకే గ్రేటర్ లో పోటీకి నిర్ణయించామని పార్టీ నేతలు ప్రకటించారు. హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు. ఎన్నికల ముందు పార్టీ శక్తి, వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కూకట్‌పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జనసేన కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా బాధ్యతలు, గ్రౌండ్ రిపోర్టులు, స్థానిక ఇష్యూలపై నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్‌ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్‌కు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయడం, యువత, మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు. నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, జీహెచ్ఎంసీలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్‌లిస్ట్ తయారు చేయాలని నేతలకు సూచించారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు (కార్పొరేటర్ సీట్లు) ఉన్నాయి. ఈ 150 సీట్లలో 76 సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. సాధారణంగా గ్రేటర్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఈ మెజారిటీని సాధించడం కష్టంగా అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం, నగరంలో మొత్తం 92.5 లక్షలకుపైగా ఓటర్లు నమోదు అయ్యారు.

Latest