Mahaa Daily Exclusive

  ఆడబిడ్డలందరికీ సారె…

Share

  • ఆడబిడ్డలందరికీ సారె
  • లోపాలు లేకుండా పండుగలా పూర్తి చేయాలి
  • ఫేషియల్ రికగ్నిషన్‌తో పంపిణీ.. తూతూమంత్రంగా చేయవద్దు
  • మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
  • ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ షురూ.. మంత్రులు, సీఎం అధికారులతో రివ్యూ

హైదరాబాద్, మహా: ‘మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం కింద కోటి మంది మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి చీరల’ పంపిణీ పథకాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయమని, ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఫేషియల్ రికగ్నిషన్‌తో చీరల పంపిణీ..
ఈ పథకం అమలు తీరును వివరిస్తూ, అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ విడతల వారీగా పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి కార్యక్రమ బాధ్యతలను అప్పగించాలని, ముందుగానే ప్రజలందరికీ ఈ పథకం గురించి తెలియజేయాలని సూచించారు. చీరల పంపిణీని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నది ప్రభుత్వ విధానమని, మున్సిపాలిటీలు, పట్టణాల్లో రెండో విడతలో చీరలు అందిస్తామని, ఏ ఒక్క మహిళకూ చీర అందలేదన్న సమస్య ఉత్పన్నం కావొద్దని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఈ పంపిణీని ప్రామాణికంగా తీసుకునేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. పంపిణీలో పారదర్శకత కోసం కుల గణన సందర్భంగా సేకరించిన డేటాను, ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని ఎక్కడా తప్పులు జరగకుండా పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా..
మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి అనేక చర్యల ద్వారా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తేవాలని, శిల్పారామంలో ఇందిరా శక్తి బజార్ కేటాయించామని, అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయించుకునే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వడ్డీలేని రుణాలు అందించడంలో గతంలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోందని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి మహిళా సమాఖ్య ప్రతినిధులు చీరల నాణ్యత, రంగు, డిజైన్ బాగున్నాయని ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest