- అందెశ్రీ గొప్ప మేధావి
- ఆయన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు
- మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
- సహజ కవి అందెశ్రీ సంతాప సభలో పాల్గొన్న ఎంపీ
హైదరాబాద్, మహా: అందెశ్రీ గొప్ప మేధావి, రాజీపడని మహనీయుడని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌లోని డీజీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన సహజకవి అందెశ్రీ సంతాప సభలో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణించేంత వరకు పీడిత ప్రజల కోసం, సమాజంలోని అట్టడుగు ప్రజానీకం కోసం తపన పడ్డ మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయనతో తనకు పాతికేళ్ళ పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి, చదువుకు దూరమైనప్పటికీ గొప్ప మేధస్సును సంపాదించుకున్న అందెశ్రీ, అప్పటికప్పుడు పెదాల మీదనే పాట రూపొందించేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చి ఐక్యం చేసిన “జయ జయహే తెలంగాణ” పాట తమకు కొత్త శక్తిని ఇచ్చిందని ప్రశంసించారు. అలాగే, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” అనే పాట యావత్ సమాజాన్ని కదిలించిందని, అది మానవ సమాజం ఉన్నంత కాలం ఉంటుందని పేర్కొన్నారు.
జీవితంలో రాజీ పడని మహనీయుడు..
అందెశ్రీ కులాల వారీగా, వృత్తుల వారీగా ప్రజలు అనుభవిస్తున్న బాధలు కళ్లకు కట్టినట్టు రాశారని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన మూలాలను మర్చిపోలేదని, డబ్బు, పలుకుబడి వెంట పరుగులు తీయకుండా అతి సామాన్య జీవితం గడిపారని తెలిపారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికీ పరిచయం ఉన్నా.. ఏనాడు ఆ పరిచయాలను సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదని, జీవితంలో రాజీ పడని మహనీయుడని కొనియాడారు. ఆయన తపన, ఆరాటం పేదల కోసమేనని, అందుకే ఆయన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటలు, మాటలు సజీవంగా ఉంటాయని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అభిమానులందరికీ ధైర్యం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.








