- హరే కృష్ణ టెంపుల్ ఉత్సవాలు విజయవంతం
- భక్తులను మైమరపించిన బ్రహ్మోత్సవాలు
- గోవింద నామస్మరణతో మార్మోగిన హరే కృష్ణ టెంపుల్
హైదరాబాద్, మహా: నవంబర్ 14న ప్రారంభమైన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వార్షిక శ్రీ బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగిశాయి. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. చివరి రోజు ఉదయం మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాలలో 108-కలశాల మహా చూర్ణాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేద మంత్రోచ్చారణలు, హరినామ సంకీర్తనల మధ్య పవిత్ర కలశాలతో అభిషేకాలు జరిగాయి. శ్రీ రాధా గోవిందులు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ నితాయి గౌరంగ, శ్రీల ప్రభుపాదుల వారికి పంచామృతం, ఫలరసాలు, వనమూలికల చూర్ణాలు, నవరత్నాలు వంటి ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. గంగా యమునతో సహా ఏడు పవిత్ర నదుల జలంతో ప్రత్యేక స్నానం నిర్వహించడం విశేషం. సాయంత్రం పుష్ప యాగంతో పాటు, రాత్రి మహా సంప్రోక్షణతో ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, స్వామి వారి దివ్య అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ ఉత్సవాల ద్వారా సమాజానికి శాంతి, శ్రేయస్సుతో కూడిన ఆధ్యాత్మిక పురోగాభివృద్ధి చేకూరాలని తాము ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.








