Mahaa Daily Exclusive

  దాతృత్వం చాటుకున్న మహేషన్న…

Share

  • దాతృత్వం చాటుకున్న మహేషన్న
  • సొంతూరికి భారీ విరాళం
  • 11 ఎకరాల భూమిని గ్రామాభివృద్ధికి ఇచ్చిన టీపీసీసీ చీఫ్

నిజామాబాద్, మహా : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంతూరి పట్ల తనకున్న మమకారాన్ని, బాధ్యతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని తన స్వగ్రామమైన రహత్ నగర్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ 11 ఎకరాల్లో 10 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ స్కూలుకు, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సబ్ స్టేషన్ కోసం ఒక ఎకరం భూమిని దానం చేశారు. ఈ స్కూల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అధికస్థాయి విద్య, ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. మహేశ్ కుమార్ గౌడ్ దాతృత్వాన్ని మెచ్చిన గ్రామస్తులు ఆయన్ను భారీ గజమాలలతో సత్కరించారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గారు గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని స్మరించుకున్నారు.

అనంతరం ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్, అన్వేష్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, మాజీ డిసిసీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని. ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి రూ. 380 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. ఈ రహత్‌నగర్ టెంపుల్ కారిడార్ రోడ్‌తో కరీంనగర్–నిజామాబాద్ మధ్య సెంటర్ పాయింట్ అవుతుందన్నారు. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ధర్మపురి నుంచి బాసర వరకు ప్రతిపాదించిన టెంపుల్ కారిడార్ రోడ్డు రహత్ నగర్ గ్రామం మీదుగా రానుందని, ఇందుకు తానెంతో కృషి చేశానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తాను చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

Latest