- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు పకడ్బంధీ ఏర్పాట్లు
- అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- డిసెంబర్ 8, 9 తేదీలలో జరుగనున్న సమ్మిట్
- దాదాపు రెండు వేల మంది హాజరయ్యే అవకాశం
హైదరాబాద్, మహా : డిసెంబర్ 8, 9 తేదీలలో ఫ్యూచర్ సిటీలో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సమ్మిట్‌కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించనున్న సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాస్‌లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమ్మిట్‌కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తాను పరిశీలిస్తానని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పారు. బందో బస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమ్మిట్‌కు హాజరయ్యే మీడియాకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో తన విజన్, పాలసీలను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా కానుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమ్మిట్ ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్దమైంది.






