హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం.
* పలు సంస్థల్లో ఈడీ సోదాలు.
* ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో మోసం.
* జయత్రి ఇన్ఫ్రాపై ఈడీ పంజా
* రూ. 60 కోట్ల స్కామ్.. పరారీలో ఎండీ కాకర్ల శ్రీనివాస్.
* మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు.
* 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.
* జయత్రి సహా 5 సంస్థల ఖాతాలు సీజ్
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరంలోని రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామాన్యుల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపింది. ప్రధానంగా జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు అనుబంధ సంస్థల కార్యాలయాల్లో సోమవారం ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దాదాపు రూ. 60 కోట్ల మేర జరిగిన భారీ మోసంపై మనీలాండరింగ్ కోణంలో విచారణ వేగవంతం చేస్తూ కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద సోమవారం హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు నగరంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జయత్రి సంస్థ కార్యాలయాలతో పాటు దాని మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ నివాసాలు, ఇతర అనుబంధ సంస్థలైన జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ బిల్డర్స్, ఆర్.కే. రమేష్, సత్య సాయి ట్రాన్స్పోర్ట్, శ్రీ గాయత్రి హోమ్స్, శివ సాయి కన్స్ట్రక్షన్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.
గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ప్రీ-లాంచ్ స్కీమ్‌ల పేరుతో అమాయక గృహ కొనుగోలుదారుల నుంచి జయత్రి సంస్థ సుమారు రూ. 60 కోట్లు వసూలు చేసిందని, ఆ తర్వాత వారికి ఫ్లాట్లు ఇవ్వకుండా లేదా డబ్బు తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సంస్థ చేసిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దాడుల్లో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మరియు దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన కీలకమైన డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఆయా సంస్థలకు సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేసినట్లు ఈడీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయత్రి ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ను గతంలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, బెయిల్‌పై విడుదలైన ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా నిందితులను గుర్తించేందుకు, అలాగే మనీలాండరింగ్ ద్వారా మళ్లించిన నిధుల గుట్టు రట్టు చేసేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.








