Mahaa Daily Exclusive

  ‘హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోంది’: సీఎం వ్యాఖ్యలపై హిందూ సమాజం స్పందించాలి – డీకే అరుణ

Share

  • హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోంది
  • హిందూ సమాజమంతా సీఎం వ్యాఖ్యలపై స్పందించాలి
  • కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు
  • మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్, మహా : హిందూ దేవుళ్లను అవమానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తానే గొప్ప హిందువునంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలను అవహేళన చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి సైతం పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై నోరు పారేసుకోవడం శోచనీయమన్నారు. సర్వేజనా సుఖినోభవంతు. అందరూ బాగుండాలని కోరుకునేదే హిందూ సనాతన ధర్మమన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నరనరాల్లోనూ హిందూ ద్వేషం నింపుకుందన్నారు. హిందువుల పట్ల, హిందూ సనాతన ధర్మం పట్ల విషం చిమ్ముతోందని విరుచుకుపడ్డారు. దేవుళ్లు, దేవాలయాలు తిండిపెడతాయా? కొలువులిస్తాయా? అంటూ గతంలో కాంగ్రెస్ నేత శ్యాంపిట్రోడా హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, నేడు రేవంత్ రెడ్డి సైతం తాగుబోతులకు ఒక దేవుడు, మాంసాహారులకు ఒక దేవుడు ఉన్నాడంటూ అవమానించి సనాతన హిందూ ధర్మాన్ని చులకన చేస్తున్నారన్నారు. హిందూ సమాజమంతా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. సీఎం చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హిందువుల ఓట్లతో గెలిచి హిందువులనే అవమానించేలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిందూ సమాజమంతా తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయని హెచ్చరించారు.

Latest