- హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
- సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, మహా : డీసీసీ అధ్యక్షుల కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే రేవంత్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులను, హిందూ దేవుళ్లను అమానించడమే తమ కార్యాచరణగా కాంగ్రెస్ పెట్టుకుందని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా హిందూగాళ్లు.. బొంగుగాళ్లు అని మాట్లాడారని, ఆయనకు ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలను వక్రీకరించారని రేవంత్ స్పష్టతనిచ్చారు.





