Mahaa Daily Exclusive

  కోటి రూపాయల వెండి మండపంతో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శోభ – ఆర్.వి.ఆర్. సంస్థ రజత కానుక

Share

 

కోటి రూపాయల వెండి మండపంతో మోపిదేవికి శోభ!
* స్వామివారికి 49 కేజీల రజత కానుక సమర్పణ.
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పాను పట్నంపై మెరిసిన రజత మండపం.
* ఆర్.వి.ఆర్. సంస్థ దాతృత్వం.. మోపిదేవి ఆలయంలో అద్భుత ఘట్టం.

హైదరాబాద్, మహా.

కృష్ణాజిల్లా అవనిగడ్డ లోదినదినాభివృద్ధి చెందుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య సముఖంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోటి రూపాయలకు పైగా విలువైన భారీ వెండి మండపాన్ని ఆర్.వి.ఆర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత రావి వీర రాఘవ చౌదరి దంపతులు ఆలయానికి సమర్పించి, తమ నిరుపమాన భక్తిని చాటుకున్నారు.

* వైభవాన్ని పెంచిన రజత కానుక*

చారిత్రక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్టు పాను పట్టంపై అలంకరించేందుకు ఉద్దేశించిన ఈ వెండి మండపం, పూర్వపు మండపం జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో దాతలచే సమర్పించబడింది. గతంలో స్వామివారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన రావి వీర రాఘవ చౌదరి దృష్టికి పురోహితులు ఈ విషయాన్ని తీసుకురాగా, వారు తక్షణమే స్పందించి, స్వామివారి వైభవానికి అద్దం పట్టేలా నూతన మండపాన్ని తయారు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు, సుమారు 49 కిలోల స్వచ్ఛమైన వెండితో, కోటి రూపాయలకు పైగా (ఖచ్చితంగా 1,01,53,000) విలువైన శిల్పకళా అద్భుతమైన మండపాన్ని అత్యంత నిష్టతో తయారు చేయించారు.

వేదమంత్రాల మధ్య అలంకరణ

గురువారం నాడు జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో, రావి వీర రాఘవ చౌదరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆలయ కార్యదర్శి దాసరి శ్రీరామ వరప్రసాదరావు సమక్షంలో, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ నూతన వెండి మండపాన్ని స్వామివారికి అలంకరించారు. ఈ దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

* ప్రముఖుల ప్రశంసలు*

ఈ వెండి మండపం సమర్పణ వేడుకకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఆర్.వి.ఆర్. సంస్థ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పట్ల కనబర్చిన ఈ భక్తి, దైవ సేవకు ప్రతీకగా నిలుస్తుంది” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర స్వచ్ఛంద్రా కమిషన్ చైర్మన్ పట్టాభి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలలో భాగస్వాములయ్యారు. ఈ రజత మండపం మోపిదేవి క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది.

Latest