- ధృవనక్షత్రంలా భారత్ -రష్యా మైత్రి
- ఈ స్నేహం ఎప్పటికీ శాశ్వతం
- ద్వైపాక్షి భేటీలో ప్రధాని మోదీ
- వికసిత్ భారత్కు సంపూర్ణంగా సహకరిస్తాం: పుతిన్ హామీ
- ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు.. సంయుక్తంగా మీడియా సమావేశం
ఢిల్లీ, మహా
భారత్-రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ రోడ్‌మ్యాప్ ఇరుదేశాల మధ్య ప్రాధాన్య రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందని చెప్పారు. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య మార్కెట్లకు ద్వారాలు తెరవటం, వాణిజ్యం పెంచేందుకు వీలుగా త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయటంపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. వలసలు, మొబిలిటి, వైద్యం, ఆహార భద్రత, ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఇరుదేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత్-రష్యా మధ్య మైత్రి ఎనిమిది దశాబ్దాలకుపైగా ధృవనక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, నమ్మకంతో ఎల్లప్పుడూ కాలపరీక్షకు నిలిచాయన్నారు. భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో భారత్ యాక్టివ్‌గా పాల్గొంటుందని చెప్పారు. ఈ వేదిక ఇరుదేశాల పరిశ్రమల్లో సహ-ఉత్పత్తి, సహ-నూతన కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని ప్రధాని చెప్పారు.
వికసిత్ భారత్కు సంపూర్ణంగా సహకరిస్తాం: పుతిన్ హామీ
భారత్- రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భేటీలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మోదీ, తాను చర్చించామని చెప్పారు. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయిల్, గ్యాస్, బొగ్గు అన్నింటినీ సరఫరా చేస్తామని వెల్లడించారు. వికసిత్ భారత్కు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్ ప్రసంగించారు. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించాం. భారత్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. ఇరుదేశాల వాణిజ్యం 64 బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్లకు పెరగాలి. ఇరుదేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇరుదేశాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. భారత్‌లో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తాం అని పుతిన్ చెప్పారు.
…







