- మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా
- వయసూ, ఓపిక ఉంది కేంద్రాన్ని నిలదీస్తా
- తెలంగాణకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ
- రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు
- నర్సంపేట సభలో గర్జించిన సీఎం రేవంత్ రెడ్డి
- జుబ్లిహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారు
- త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీ
- మార్చి 31 కల్లా వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం
వరంగల్, మహా : రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే ఢిల్లీ ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని, అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ ఆనందం పొందుతుందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. నాకు వయస్సు ఉంది, ఓపికా ఉంది కేంద్రాన్ని నిలదీసే సత్తా ఉంది, కేవలం మీరు మాకు సహకరించండి, కేంద్రం మెడలు వంచి చూపిస్తానని అన్నారు. నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని, తెలంగాణ అభివృద్ధితో పాటు వరంగల్ ప్రాంతాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. దేశ ఆర్థిక వృద్ధి రేటుకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకు వెళ్తున్నామని అంటూ ఇన్ని చేస్తున్నా కేంద్రం మాత్రం ఏ మాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కు నిధులను కేటాయించడం లేదని, అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేంద్ర సహకారం అవసరమన్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నామని, వినతి పత్రాలను ఇస్తున్నామని, అయినా కనికరించడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండటాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు జీర్ణించుకోవాలడం లేదని ధ్వజమెత్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. గత పదేళ్లలో బీఆరెస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి హెచ్చరించి రైతాంగాన్ని నిర్వీర్యపరచేందుకు ప్రయత్నించారన్నారు. కానీ నేడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతు రుణ మాఫీ ఉండదు, రైతు భరోసా ఎత్తేస్తారని భయపెట్టారన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని సీఎం పేర్కొన్నారు. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి గర్వకారణమన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలంటే వాళ్ల ఆస్తులు రాసిచ్చినట్లు మాట్లాడారని, నేడు ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. 3 కోట్ల 10 లక్షల మంది బిడ్డలకు సన్నబియ్యం కూడా అందిస్తున్నామన్నారు. ఏడాదికి రూ. 13 వేల కోట్లు భారమైనప్పటికీ పేదవాడి ఆకలి తీర్చాలని సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నదే మా ప్రయత్నమన్నారు. 2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి రూ. 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలా వరంగల్ ను తీర్చి దిద్దుతామని,
హైదరాబాద్ లా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.
మార్చి 31 లోగా వరంగల్ ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందని, అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు మహిళలను బస్సులకు యజమానులను చేశామన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామవి. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు చీర చేరాల్సిందేనని, ఏ ఆడబిడ్డ తనకు చీర రాలేదు అనే మాట రావద్దన్నారు. చదువుకున్న వాడే గుణవంతుడు.. ధనవంతుడని, చదువొక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుందన్నారు. అందుకే మీ పిల్లలను చదివించండి.. మీ పిల్లల చదువుకు కావాల్సిన వసతులు అందించే బాధ్యత నాది అని సీఎం భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయవద్దని, ప్రజల మనసులు గెలుచుకోండని యువతను కోరారు. గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, గ్రామాల్లో రాజకీయ కక్షలకు తావు ఇవ్వొద్దన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేసుకునే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండని కోరారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం అన్నోళ్లు ఇంట్లో పడుకోక మళ్లీ అబద్దాలు చెబుతూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను బండకేసి కొట్టారని, అయినా బుద్ది రాలేదన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎనాడైనా ఆలోచించలేదని, తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడా ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నా ఆలోచన కేసీఆర్కు రాలేదన్నారు. గడీల పాలనను ప్రజలు కూలగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేళ్లలో గత పాలకులు మాత్రమే భారీగా ఆస్తులు సంపాదించారు, వాళ్లు ఆకాశానికి ఎదిగారు తప్ప.. ప్రజలను పట్టించుకోలేదన్నారు. వరి పండించండి.. ప్రతిగింజ మేం కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో అందజేసిన తెలంగాణను.. కేసీఆర్ అప్పులపాలు చేశారని, అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు.







