- పాన్ మసాలా సెస్సుతో రక్షణ నిధి..
- లోక్‌సభలో కీలక బిల్లుకు ఆమోదం.
- ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత..
- పాన్ మసాలా ఆదాయం ఇక రక్షణ శాఖకే.
- పార్లమెంట్‌లో నిర్మలమ్మ వివరణ.
న్యూఢిల్లీ , మహా.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అత్యంత కీలకమైన ‘ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు-2025’కు సభ్యులు ఆమోదం తెలిపారు. ముజువాణీ ఓటుతో ఈ బిల్లు సభలో పాస్ అయ్యింది. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన పాన్ మసాలాలపై అదనపు సెస్సు విధించడానికి ఈ బిల్లు ద్వారా మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఈ సెస్సు ద్వారా సమకూరే ఆదాయాన్ని దేశ రక్షణ శాఖ అవసరాలకు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో వెల్లడించారు. పాన్ మసాలా ఉత్పత్తులపై వచ్చిన పన్నులను రక్షణ రంగానికి మళ్లించడంపై జరిగిన చర్చలో మంత్రి పాల్గొంటూ పలు కీలక విషయాలను స్పష్టం చేశారు.
బిల్లుపై చర్చ సందర్భంగా పాన్ మసాలాపై విధించిన సెస్సును ప్రత్యేకంగా రక్షణ బడ్జెట్‌కే ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలకు మంత్రి సమాధానమిచ్చారు. సభలోని ఏ ఒక్క సభ్యుడు కూడా పాన్ మసాలా ఉత్పత్తులపై తక్కువ పన్ను ఉండాలని కోరుకోవడం లేదని, ఈ ఉత్పత్తులు ప్రజారోగ్యానికి చేటు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజారోగ్యం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, రక్షణ అనేది కేంద్రం జాబితాలోనిదని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సమర్ధమైన రక్షణ సదుపాయాలు ఉండడం అత్యవసరమని, ఇందుకోసం ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి నొక్కి చెప్పారు. అనారోగ్యానికి కారణమయ్యే పాన్ మసాలా వంటివి సామాన్యులకు తక్కువ ధరకే లభించకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
పాన్ మసాలా ఉత్పత్తుల వాడకాన్ని బట్టి వాటిపై జీఎస్టీ కింద గరిష్టంగా 40 శాతం వరకు పన్ను విధిస్తామని, అయితే ఈ సెస్ ప్రభావం సాధారణ జీఎస్టీ రాబడిపై ఏమాత్రం ఉండదని ఆర్ధిక మంత్రి హామీ ఇచ్చారు. ఏదైనా పని కోసం డబ్బును ఖర్చు చేయవచ్చని, కానీ ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఒక సరైన విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశ ఆదాయ గణాంకాలను సభ ముందుంచిన మంత్రి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 6.1 శాతంగా ఉందని, 2010-14 మధ్య కాలంలో ఈ శాతం 7గా నమోదైందని గణాంకాలతో సహా వివరించారు.






