- నభూతో నభవిష్యత్
- అత్యంత ఘనంగా సమ్మిట్ నిర్వహణ
- గ్లోబల్ సమ్మిట్ అజెండ ఖరారు
- సమ్మిట్‌లో నిర్వహించనున్న 27 ప్రత్యేక సెషన్లు.
- అడుగడుగునా నిఘా, భారీ స్క్రీన్లు, పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
- అతిథిలకు ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా ఇంటర్నెట్ సేవలు
- నిరంతర విద్యుత్ కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ
హైదరాబాద్, మహా : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండాను ప్రభుత్వం ఖరారు చేసింది. రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో వివిధ అంశాలను మొత్తం 27 సెషన్లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సదస్సులో డిసెంబర్ 9 న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దడానికి రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు.
రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు టీఈఆర్ఐ, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచి ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్కో అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఏఎస్ఎస్సీఓఎం, సాఫ్రాన్, డీఆర్డీఓ, స్కైరూట్, ధృవ స్పేస్, అముల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, బ్లాక్‌స్టోన్, డెలాయిట్, క్యాపిటల్‌ల్యాండ్, స్విగ్గి, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఇనోక్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్, వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘ఒలింపిక్ గోల్డ్ క్విస్ట్’ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘క్రియోటివ్ సెంచరీ – సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్ టైన్ మెంట్’ చర్చలో పాల్గొంటారు.
దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు వేదికలో రెండో రోజైన డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు
ఫ్యూచర్‌సిటీలోని 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ భద్రత నడుమ జరగనున్న సదస్సు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇప్పటికే ఈ సమ్మిట్‌కు రావాలని ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, జాతీయ స్తాయి ప్రతిపక్ష నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సదస్సుు డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల పనులను ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోంది. సదస్సు జరిగే ప్రాంతంలో భారీ స్థాయిలో విద్యుత్, స్టేజ్‌లు, సమావేశ హాళ్లు, భద్రత, ల్యాండ్‌స్కేపింగ్ పనులు మూడు షిఫ్ట్‌లుగా కొనసాగుతున్నాయి.
ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశానిర్దేశం చేసే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర ముఖ్య రంగాలకు సంబంధించిన దీర్ఘకాల ప్రణాళికలు ఉండనున్నాయి. సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, టెక్నాలజీ సంస్థలు పాల్గొననున్నారు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, అవకాశాలు, ప్రాజెక్టులు ఈ వేదికలో ప్రదర్శించబడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్‌పై మరింత ప్రాధాన్యత పొందే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం ఉదయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత ‘డ్రై రన్’ నిర్వహించడానికి నిర్వాహక కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ట్రైయల్ రన్‌గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అన్ని కార్యక్రమాల్లో తప్పొప్పులను విశ్లేషించుకుంటారు. వాటిని వెంటనే సరిదిద్దుకుంటారని అధికారులు చెప్పారు.
10జీబీ ఇంటర్నెట్ సేవలు
ఈ సమ్మిట్‌లో ఇంటర్నెట్కు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ పైబర్ గ్రిడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ ప్రాంగణంలో అండర్‌గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను రెడీ చేసింది. దీని ద్వారా 5 జీ డేటాను 10 జీబీపీఎస్ స్పీడ్‌తో అందించనుంది. ఒకే కాలంలో 10 వేల మంది ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో ఎటువంటి సాంకేతిక, భద్రత సమస్యలు తలెత్తకుండా, మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి టి-ఫైబర్ వేదికకు దగ్గరే నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్ఓసీ)ని ఏర్పాటు చేసింది. దీనిని రాత్రింబవళ్లు పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతినిధులు వెంటనే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు, కమ్యూనికేషన్ సాఫీగా సాగేందుకు, రియల్‌టైమ్ ఆపరేషన్లు కొనసాగడానికి వీలుగా ఒకే దశ క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ సౌకర్యం కల్పించింది.
అంతా ఎల్ఈడీ స్క్రీన్లే
సదస్సు ప్రాంగణమంతా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు రోడ్డు మొత్తం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో జరిగే అన్ని కార్యక్రమాలను, సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని వాటిపై ప్రదర్శించనున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 8 వేదికల్లో.. 3,000 టన్నుల సామర్థ్యంతో కూడిన ఏసీ యంత్రాలను అమర్చారు.
అంతరాయం లేని విద్యుత్
గ్లోబల్ సమ్మిట్ సమయంలో ఏ మాత్రం విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మిట్ జరిగే ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి సదస్సు ముగిసే వరకు కూడా క్షణం కూడా విద్యుత్ సరఫరా ఆగకుండా చర్చలు తీసుకోనున్నారు. ఇందుకోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) 150 మంది సిబ్బందిని నియమించింది. మీర్ఖాన్పేటలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి సదస్సు జరిగే ప్రాంతానికి రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్‌తో భూగర్భంలో విద్యుత్ లైనును ఏర్పాటుచేశారు. ఒక 100 కేవీ, రెండు 160 కేవీ, రెండు 315 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ప్రాంగణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
భారీ భద్రత
గ్లోబల్ సమిట్‌కు దేశ విదేశాల నుంచి కీలక అతిథులు, ప్రముఖులు హాజరుకానుండటంతో తెలంగాణ పోలీసు శాఖ అతి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో సమిట్ వేదికగా ఉన్న వంద ఎకరాల ప్రాంగణం మొత్తం భద్రతా పరంగా నిఘాలోకి తీసుకున్నారు, ప్రాంగణం అంతటా దాదాపు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ఏవైనా అనుమానాస్పద అంశాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నుండి మొత్తం 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. సమిట్ ప్రాంత చుట్టుపక్కల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మరో 1,000 మంది ట్రాఫిక్ పోలీసులకు బాధ్యతలు ఇచ్చారు. సమిట్ సమయంలో రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్‌ను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్య అతిథుల రాకపోకలు ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు విస్తృత ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. భద్రతా చర్యలను ఇంకా సమీక్షిస్తూ అవసరమైతే అదనపు బలగాలను కూడా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.






