- సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
- ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకుంటున్నాం
- సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం
- రెండేళ్ల పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజా ఆమోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్ , జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం తనను కలిసిన విలేకరులతో రెండేళ్ల పాలనపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతున్నామని, రెండేళ్ల కాలం మరీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలోనే సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ది దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు.
రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామన్నారు. ఎక్కడాలేని ఎవరూ ఊహించని అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు దేశానికి దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రధం పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, వీటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామన్నారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని, ఆర్దిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని తలిపారు. అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని, ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పధకాలను అమలు చేశామని తెలిపారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని, ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అదే విధంగా 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకుని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్దిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలకు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని, హైదరాబాద్‌లో తొలిసారి జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలను రిఫరెండమ్ అని ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే మా ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో అందరికీ అర్ధమవుతుందన్నారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాలలో విప్లవాత్మక మార్పుల తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంతవరకు తగ్గించడం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రధమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యదిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయన్నారు.







