హైదరాబాద్, మహా : ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్‌లో భాగంగా ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డీఓపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్బంగా ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.






