8 లక్షల కోట్లు ఆవిరి.
* ఆర్బీఐ ‘బూస్ట్’ ఇచ్చినా కుప్పకూలిన స్టాక్ మార్కెట్.
* విలవిలలాడిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇన్వెస్టర్లకు భారీ షాక్!
* ఒక్క రోజులోనే మార్కెట్ అతలాకుతలం.
* రూపాయి పతనం, ముడిచమురు సెగతో విలవిల.
హైదరాబాద్, మహా.
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం నాటి ట్రేడింగ్ మదుపరులకు పీడకలగా మారింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో పాటు, సుమారు రూ. 1.5 లక్షల కోట్ల లిక్విడిటీని వ్యవస్థలోకి పంపిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు ఉత్సాహంగా పరుగులు పెడతాయని అంతా భావించారు. అయితే, మార్కెట్ గతిని మార్చేసే ప్రతికూల అంశాలు బలంగా ఉండటంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభమైన కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు సుమారు రూ. 8 లక్షల కోట్ల సంపదను కోల్పోవడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది.
ట్రేడింగ్ సరళిని గమనిస్తే, ఉదయం 85,624 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్నానికి 84,969 పాయింట్ల స్థాయికి పడిపోయింది. దాదాపు 800 పాయింట్ల మేర సెన్సెక్స్ నష్టపోగా, నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 280 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ కీలకమైన 26,000 మార్కును కోల్పోయి 25,932 వద్ద ట్రేడయ్యింది. ప్రధానంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇండిగో సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం, తగిన స్పందన రాకపోతే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు వెలువడటంతో ఆ కంపెనీ షేర్లు ఏకంగా 7 శాతం మేర పతనమయ్యాయి. ఇది మొత్తం మార్కెట్ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపింది.
మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్‌ను భయపెట్టాయి. డిసెంబర్ 9న జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై మదుపరులు దృష్టి సారించారు. వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఏడవ సెషన్‌లోనూ అమ్మకాలకే మొగ్గు చూపారు. కేవలం డిసెంబర్ నెలలోనే వారు రూ. 11 వేల కోట్లకు పైగా నిధులను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం.
వీటికి తోడు రూపాయి విలువ పతనం, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్‌కుశాపంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.11 కనిష్ట స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 63.83 డాలర్లకు పెరగడం వంటి అంశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయన్న ఆందోళన వ్యక్తమైంది. మొత్తంగా సానుకూల వార్తలు ఉన్నప్పటికీ, ప్రతికూల పవనాలు బలంగా వీయడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది.






