Mahaa Daily Exclusive

  భారత గడ్డపై సాకర్ దేవుడు..

Share

భారత గడ్డపై సాకర్ దేవుడు..
* భాగ్యనగరంలో మెస్సీ మేనియా!
* రేవంత్‌తో మ్యాచ్.. మోదీతో భేటీ!
* దశాబ్దం తర్వాత భారత్‌కు మెస్సీ..
* ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ జాతర
* 70 అడుగుల విగ్రహం, ర్యాంప్ వాక్.. మెస్సీ టూర్ షెడ్యూల్ అదుర్స్!

హైదరాబాద్, మహా.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ‘సాకర్ దేవుడి’గా కొలువబడుతున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు రంగం సిద్ధమైంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు భారత గడ్డపై కాలుమోపనుండటంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ‘ది గోట్ ఇండియా టూర్‌-2025’ పేరుతో జరగనున్న ఈ పర్యటనలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మెస్సీ సందడి చేయనుండటం విశేషం. ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఈ పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
ఈ నెల 13న కోల్‌కతా వేదికగా మెస్సీ భారత పర్యటన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ప్రేమించే బెంగాల్ గడ్డపై మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రభుత్వం మరియు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మెస్సీకి సంబంధించిన 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే మెస్సీకి సంబంధించి ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కావడం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ కార్యక్రమం వర్చువల్‌గా జరగనుంది. కోల్‌కతా పర్యటన ముగించుకుని, అదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో తన 200 మంది భారీ బృందంతో కలిసి మెస్సీ హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టనున్నాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈవెంట్ ఈ పర్యటనకే హైలైట్‌గా నిలవనుంది. ఇక్కడ జరగనున్న 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ తన మ్యాజిక్ చూపించనున్నాడు. విశేషమేమిటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీతో కలిసి గోట్ కప్‌కు హాజరుకానున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు క్యూ కడుతున్నారు. మ్యాచ్ అనంతరం యువ క్రీడాకారులకు మెస్సీ ప్రత్యేకంగా మాస్టర్ క్లాస్ నిర్వహించి, పెనాల్టీ షూటౌట్స్‌తో అభిమానులను అలరించనున్నాడు. ఆ రాత్రికి నగరంలోనే బస చేయనున్న మెస్సీ కోసం పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
క్రీడలతో పాటు గ్లామర్ ప్రపంచంలోనూ మెస్సీ మెరవనున్నాడు. హైదరాబాద్ పర్యటన అనంతరం ముంబయి చేరుకోనున్న ఈ సాకర్ స్టార్, అక్కడ బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేయనుండటం విశేషం. తన పర్యటన ముగింపు దశలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 2011లో వెనిజువెలాతో జరిగిన మ్యాచ్ కోసం కోల్‌కతా వచ్చిన మెస్సీ, ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్‌గా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా భారత్‌కు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Latest