Mahaa Daily Exclusive

  * బీటెక్ విద్యార్థి దారుణ హత్య…

Share

నమ్మించి నట్టేట ముంచారు.
* ప్రేమించిన పాపానికి ప్రాణం తీశారు!
* అల్లుడిగా ఆహ్వానించి.. శవంగా మార్చారు
* పెళ్లి పీటలు ఎక్కించాల్సిన వాళ్లే.. పాడె కట్టారు.
* బీటెక్ విద్యార్థి దారుణ హత్య
* బీరంగూడలో ఒళ్ళు గగుర్పొడిచే ఘోరం.

హైదరాబాద్, మహా.

*సమాజం ఎంత మారుతున్నా, మనుషుల ఆలోచనల్లో ఇంకా మార్పు రావడం లేదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రేమ వివాహానికి ఒప్పుకున్నట్లే నటించి, కన్నబిడ్డ మనసును అర్థం చేసుకోలేక, పరువు కోసం పచ్చని ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నమ్మకం అనే ముసుగులో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక బీటెక్ విద్యార్థిని పెళ్లి పేరుతో ఇంటికి పిలిపించి, పథకం ప్రకారం యువతి బంధువులు చేసిన దాడిలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది*

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో మానవత్వం మరువబడిన ఘటన వెలుగుచూసింది. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించిన విషయమని మరిచిన యువతి కుటుంబ సభ్యులు, ఆ ప్రేమను ద్వేషంతో అంతం చేశారు. కుత్బుల్లాపూర్‌ నివాసి, మైసమ్మగూడ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జ్యోతి శ్రావణ్ సాయి (20) అనే యువకుడిని అతి కిరాతకంగా హతమార్చారు. శ్రావణ్ సాయి మరియు బీరంగూడకు చెందిన శ్రీజ (19) చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఆ పరిచయం కాస్తా పదో తరగతి సమయానికి గాఢమైన ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు.
అయితే, వీరి ప్రేమ విషయం శ్రీజ ఇంట్లో తెలియడంతో పెద్దల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పలుమార్లు శ్రావణ్ సాయిని హెచ్చరించినప్పటికీ, వారి ప్రేమ బంధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు శ్రావణ్ సాయిపై కక్ష పెంచుకున్నారు. నేరుగా వారిస్తే వినరని గ్రహించి, కుట్రపూరితంగా వ్యవహరించారు. ‘మీ ప్రేమను మేము అర్థం చేసుకున్నాం, ఇంటికి రండి మాట్లాడుకుందాం, పెళ్లి చేద్దాం’ అంటూ శ్రావణ్ సాయికి తీపి కబురు చెప్పారు. ఆ మాటలను పూర్తిగా నమ్మిన శ్రావణ్ సాయి, ఎంతో సంతోషంతో శ్రీజ ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ తనకోసం మృత్యువు కాచుకుని ఉందని అతను ఊహించలేకపోయాడు.
శ్రావణ్ సాయి ఇంటి గడప తొక్కగానే, అప్పటికే పథకం ప్రకారం సిద్ధంగా ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు మూకుమ్మడిగా అతడిపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టి, హింసించి అతడి ప్రాణాలు తీశారు. ప్రేమను గెలిపించుకోవడానికి వచ్చిన ఆ యువకుడు, వారి చేతిలో శవమై మిగిలాడు. సమాచారం అందుకున్న వెంటనే అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. చేతికి అందివచ్చిన కొడుకు, ప్రేమ పేరుతో ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేక శ్రావణ్ సాయి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

Latest