Mahaa Daily Exclusive

  నోబెల్ వేదికపై ఉద్వేగం….అమ్మ కోసం అవార్డు అందుకున్న కూతురు….

Share

* నోబెల్ వేదికపై ఉద్వేగం.
* అమ్మ కోసం అవార్డు అందుకున్న కూతురు.
* వెనిజులా విముక్తి కోసమే మా పోరాటం..
* త్వరలోనే అందరం కలుసుకుంటాం.
* నోబెల్ సభలో అన కోరినా కన్నీటి పర్యంతం
* నియంతృత్వంపై గెలుపు మాదేనన్న నోబెల్ విజేత.

ఢిల్లీ,మహా.

*వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియా కోరినా మచాడోకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, తన దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టు భయాల నడుమ ఆమె అజ్ఞాతంలో ఉండటంతో బుధవారం నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి సమయానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున కూతురు అన కోరినా సోసా అవార్డును స్వీకరించారు. తల్లి రాసిన లేఖను చదివి వినిపిస్తూ, ఆశయ సాధన కోసం తమ కుటుంబం పడుతున్న వేదనను వివరించి సభను ఉద్వేగానికి గురిచేశారు*

ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం నార్వేలోని ఓస్లో సిటీ హాల్‌లో అత్యంత వైభవంగా, అంతే ఉద్వేగభరితంగా జరిగింది. వెనిజులాలో నిరంకుశ పాలన అంతమొందించి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నందుకు గాను మరియా కోరినా మచాడోకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే ఆమె ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నారని, ఆమె సురక్షితంగానే ఉన్నారని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ వేడుకలో మచాడో తరఫున ఆమె కుమార్తె అన కోరినా సోసా అవార్డును స్వీకరించి, తన తల్లి పంపిన సందేశాన్ని ప్రపంచానికి వినిపించారు.
గత రెండేళ్లుగా తన తల్లిని చూడలేకపోయానని, ఆమెను ఆలింగనం చేసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నానని అన కోరినా కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లి మాదిరిగానే ఎంతోమంది వెనిజులా బిడ్డలు తమ తల్లులకు దూరమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వెనిజులాలో జీవించాలన్నదే తన తల్లి దృఢ సంకల్పమని, ఆ లక్ష్యం కోసం ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయరని స్పష్టం చేశారు. తన తల్లి రాసిన ప్రసంగాన్ని చదువుతూ.. వెనిజులా ప్రజలందరూ మళ్ళీ ఒక్కటవుతారని, తమ వీధుల్లో మళ్ళీ నవ్వులు, సంగీతం వినిపిస్తాయని, ప్రపంచం మామూలుగా భావించే చిన్న చిన్న ఆనందాలు తమకు కూడా దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ వైపు సాగే ప్రయాణం ఎప్పుడూ తమ అంతరాత్మలోనే ఉందని, తాము మళ్ళీ సొంత ఇంటికి, సొంత అస్తిత్వానికి తిరిగి వస్తున్నామని చెప్పినప్పుడు సభలోని వారంతా లేచి నిలబడి ఘనంగా చప్పట్లతో అభినందించారు.
మరోవైపు, మచాడో ఆచూకీపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జులై 2024లో వెనిజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత, నికోలస్ మదురో ప్రభుత్వం ఆమెపై అణచివేత చర్యలు ప్రారంభించడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆమెను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓస్లోకు రాగలరా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే, “నేను ఓస్లోకు వస్తున్నాను, మార్గమధ్యంలో ఉన్నాను” అని మచాడో పంపిన ఆడియో సందేశాన్ని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ షేర్ చేసింది. ఆమె బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయానికి ఓస్లో చేరుకుంటారని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్ తెలిపారు.
వెనిజులాలో జరిగిన ఎన్నికలు రిగ్గింగ్ జరిగాయని ఆరోపిస్తూ మచాడో నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో దాదాపు 2000 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. విపక్షాలన్నింటినీ ఏకం చేసి మదురో పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మచాడో, అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇప్పుడు ఆమె నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం అంతర్జాతీయంగా వెనిజులా ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చినట్లయింది. ఆమె ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరారనే విషయం మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు. ప్రస్తుతం ఓస్లోలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆమె రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Latest