ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ.
*వాణిజ్యం, రక్షణ రంగాలపై కీలక చర్చలు
* అంతర్జాతీయ పరిణామాలపై సమాలోచనలు
ఢిల్లీ, మహా.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగించుకుని వెళ్లిన రోజుల వ్యవధిలోనే, ప్రధాని మోదీ ట్రంప్‌కు ఫోన్ చేయడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా పర్యటన అనంతరం చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రస్తుతం దౌత్య వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇరువురు నేతల మధ్య ప్రధానంగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు దృష్టి సారించారు. వీటితో పాటు వ్యాపారం, సాంకేతికత, రక్షణ , భద్రతా రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపైనా ఇరువురు నేతలు లోతుగా చర్చించారు.
పుతిన్ భారత పర్యటన సందర్భంగా రష్యాతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, వెంటనే అమెరికాతో కూడా సంప్రదింపులు జరపడం దౌత్యపరంగా కీలక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ తన చిరకాల మిత్రదేశమైన రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే, అగ్రరాజ్యం అమెరికాతో కూడా మైత్రిని పటిష్టం చేసుకునే దిశగా సమతూకం పాటిస్తున్నట్లు ఈ సంభాషణ ద్వారా స్పష్టమవుతోంది.







