Mahaa Daily Exclusive

  వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్..

Share

  • వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ
  • ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్
  • సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం
  • వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • వారం రోజుల్లో సంబంధిత పోస్టులను తొలగించాలన్న ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, మహా : సోషల్ మీడియాలో, ఈ-కామర్స్‌ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే పోస్టులు వైరల్ అవుతున్నాయని ప్రముఖ నటుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. అభ్యంతరకర లింక్ లను కోర్టుకు సమర్పించాలని పవన్ కల్యాణ్ న్యాయవాదిని ఆదేశిస్తూ రెండు రోజుల గడువు ఇచ్చింది. పిటిషనర్ కు అభ్యంతరకరమైన లింక్ లను ఏడు రోజుల్లోగా తొలగించాలని సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్

గతంలో ఈ అంశంపైనే పలువురు సినీ ప్రముఖులు పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్, శిల్పాశెట్టి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ కపూర్‌ లతో పాటు ఆర్ట్‌ ఆఫ్ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ తదితరులు ఉన్నారు. సెలబ్రిటీల ఫొటోలు, వారి పేర్లను వాడుకుంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొంత మంది వ్యూస్ కోసం పోస్టులను వైరల్ చేస్తుండగా, మరికొంత మంది కావాలని సెలబ్రిటీల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులను పెడుతున్నారు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించి హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది.

Latest