ఇదే నా ఆఖరి పోరాటం..
* ప్రభుత్వంపై అన్నా హజారే యుద్ధభేరి!
* ఏడు లేఖలు రాసినా స్పందన నిల్..
* ఫడ్నవీస్ తీరుపై అన్నా కన్నెర్ర
* జనవరి 30 నుంచి ఆమరణ దీక్ష..
* లోకాయుక్త అమలు కోసం అన్నా హజారే సమరశంఖం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాలకు చిరునామాగా మారిన ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి సమరశంఖం పూరించారు. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై తన నిరసన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని తక్షణం అమలు చేయాలనే డిమాండ్‌తో జనవరి 30 నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ప్రకటించారు. విశేషమేమిటంటే, తాను చేపట్టబోయే ఈ నిరాహార దీక్షయే తన జీవితంలో “ఆఖరి నిరసన” అవుతుందని అన్నా హజారే ఉద్వేగభరితంగా ప్రకటించి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపారు.
ఈ పోరాటం వెనుక సుదీర్ఘ చరిత్రే ఉంది. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ అన్నా హజారే 2022లోనే రాలేగావ్ సిద్ధి వేదికగా నిరాహార దీక్ష చేపట్టారు. ఆనాడు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా హామీ ఇవ్వడంతో ఆయన తన దీక్షను విరమించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ముసాయిదాను రూపొందించడం, ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే, కాగితాల మీద జరిగిన ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో మాత్రం కార్యరూపం దాల్చలేదని అన్నా హజారే మండిపడుతున్నారు.
ప్రభుత్వం తనను, తన డిమాండ్లను పూర్తిగా విస్మరిస్తోందన్న ఆవేదన అన్నా హజారే వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. లోకాయుక్త చట్టం అమలు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్‌కు తాను ఏకంగా ఏడు లేఖలు రాసినప్పటికీ, ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలకుల మౌనం, నిర్లక్ష్య వైఖరి వల్లే తాను అనివార్యంగా మళ్లీ నిరాహార దీక్షకు దిగాల్సి వస్తోందని, ఈసారి తాడోపేడో తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ‘జన్ లోక్‌పాల్’ ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. నాడు ఢిల్లీ వేదికగా ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా యువతను కదిలించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో, తన జీవిత చరమాంకంలో మరోసారి అవినీతి రహిత పాలన కోసం ప్రభుత్వంపై తన చివరి అస్త్రాన్ని సంధించడానికి అన్నా హజారే సిద్ధమవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.








