Mahaa Daily Exclusive

  కార్పొరేట్ కొలువు కాదనుకుంది…..21 ఏళ్లకే సర్పంచ్‌గా సంచలనం సృష్టించిన అనూష…

Share

కార్పొరేట్ కొలువు కాదనుకుంది..
* గ్రామ సేవకే జై కొట్టింది.
* 21 ఏళ్లకే సర్పంచ్‌గా సంచలనం సృష్టించిన అనూష.
నల్గొండ, మహా.
నేటి యువత కార్పొరేట్ ఉద్యోగాల కోసం, విదేశీ ప్రయాణాల కోసం ఆరాటపడుతున్న తరుణంలో, నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. చేతిలో ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి, తన గ్రామ రుణం తీర్చుకునేందుకు ప్రజాసేవ వైపు అడుగులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల బోయపల్లి అనూష, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఘన విజయం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన అనూష ఈ ఏడాదే బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తవగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం సాధించినప్పటికీ, ఆమె మనసు మాత్రం గ్రామ అభివృద్ధి పైనే లగ్నమైంది. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తేనే గ్రామాల రూపురేఖలు మారుతాయని బలంగా నమ్మిన ఆమె, బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఆమెకు పోటీగా కాంగ్రెస్ మద్దతుతో ఒక సీనియర్ నాయకురాలు బరిలో ఉన్నప్పటికీ, గ్రామ ప్రజలు మాత్రం యువ రక్తానికే పట్టం కట్టారు. ఫలితంగా అనూష తన సీనియర్ ప్రత్యర్థిపై 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఈ విజయంపై అనూష సంతోషం వ్యక్తం చేశారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలన్న తన ఆలోచనను గ్రామస్థులు ఆదరించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లక్షల జీతంతో వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి, సొంత ఊరి సేవ కోసం కంకణం కట్టుకున్న అనూష నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Latest