పేదల ఓటు హక్కును లాగేసుకునే కుట్ర..
* ప్రజాస్వామ్య రక్షణకే ఈ పోరాటం.
* గాంధీ, అంబేడ్కర్ ఇచ్చిన హక్కులపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి..
* రాజ్యాంగంపై బీజేపీ దాడిని సహించేది లేదు.
* ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి హెచ్చరిక.
ఢిల్లీ,మహా.
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానం వేదికగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ (ఓట్ల దొంగ.. గద్దె దిగు) మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈవీఎంల పనితీరు, ఎన్నికల సంఘం వైఖరి, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో రేవంత్ రెడ్డి చేసిన ఉద్వేగభరిత ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.
భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. దేశంలోని దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేద వర్గాలకు ఓటు హక్కు ఉండకూడదని ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు భావించారని, వారి హక్కులను కాలరాయాలని ప్రయత్నించారని రేవంత్ గుర్తు చేశారు. అయితే మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహనీయులు సాగించిన అలుపెరగని పోరాట ఫలితంగానే దేశంలోని అట్టడుగు వర్గాలకు ఓటు హక్కు లభించిందని ఆయన పేర్కొన్నారు. నాడు ఆర్‌ఎస్‌ఎస్ ఏ భావజాలంతో అయితే పేదల ఓటు హక్కును వ్యతిరేకించిందో, నేడు అదే భావజాలం కలిగిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఆ హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపైనా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని హెచ్చరించారు. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని, ప్రజల తీర్పును అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ నినాదం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే పవిత్రమైన యుద్ధమని రేవంత్ అభివర్ణించారు.
ఈ మహా ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. వారి సమక్షంలో రేవంత్ రెడ్డి హిందీలో చేసిన ప్రసంగానికి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ నడిబొడ్డున రేవంత్ చేసిన ఈ ప్రసంగం జాతీయ స్థాయిలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది.








