అమెరికా వాణిజ్య ఒప్పందంపై రైతుల ఆందోళన.
* పంజాబ్‌లో మళ్లీ ఉద్యమ జ్వాలలు.
* శంభు సరిహద్దుకు వేలాదిగా రైతులు.
* ఎన్నికల వేళ బీజేపీకి కొత్త సవాల్
చండీగఢ్,మహా.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు మరోసారి రైతు ఉద్యమాల చుట్టూ తిరుగుతున్నాయి. భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు శంభు సరిహద్దుకు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ఢిల్లీ వైపు వెళ్లకుండా హరియాణా పోలీసులు అడ్డుకోవడంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు 2020–21 వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంతో పాటు 2024 రైతుల ఆందోళనలను మరోసారి గుర్తుకు తెస్తున్నాయి.
ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి భారీ సబ్సిడీలతో వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో పాటు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రయోజనం ఉండదని, ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఇంకా ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. రైతులు, పశుపోషకుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ ఒప్పందం వ్యవసాయ రంగం, పాల పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనిని రైతులపై “అతిపెద్ద ద్రోహం”గా అభివర్ణిస్తూ, ఒప్పంద ముసాయిదాను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. శిరోమణి అకాలీదళ్ కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.
పంజాబ్‌లో మరోసారి రైతులు ఉద్యమ బాట పట్టడంతో ఎన్నికల వేళ అన్నదాతల సమస్యలే ప్రధాన రాజకీయ అజెండాగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైతు ఉద్యమం తరహాలోనే, ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఈ నిరసనలు మరింత ఉధృతమైతే దేశవ్యాప్తంగా మరో భారీ రైతు ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







