Mahaa Daily Exclusive

  ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పేరిట భారీ మోసం.

Share

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పేరిట భారీ మోసం.
* పేదలే టార్గెట్, బోర్డు తిప్పేసిన నిర్వాహకులు
* అజ్ఞాతంలో శివాని.. కోట్లలో కుచ్చుటోపి.
* విస్సన్నపేట కేంద్రంగా వెలుగుచూసిన ఆర్థిక నేరం
* ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్, మహా.
సామాన్యులనే లక్ష్యంగా చేసుకుని, వారికి రంగుల కలలు చూపిస్తూ ఆర్థికంగా మోసగించే ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పేరుతో ఓ సంస్థ అమాయక ప్రజల నుండి భారీగా డిపాజిట్లు వసూలు చేసి, చివరికి బోర్డు తిప్పేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో కలకలం రేపుతోంది. పేద, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తామంటూ నమ్మబలికిన నిర్వాహకులు, కోట్లాది రూపాయలు వసూలు చేసి పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విస్సన్నపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ నిర్వాహకులు శివాని, దుర్గాప్రసాద్ దంపతులు ప్రజలను నమ్మించడానికి ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రచారం నిర్వహించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తామని నమ్మబలికి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్లతో కూడా భారీగా ప్రచారం చేయించారు. వీరి మాటలు నమ్మి మచిలీపట్నం, భవానీపురం, విస్సన్నపేట, రాజోలు, కాకినాడ, ఏలూరు, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలనే లక్ష్యంగా చేసుకున్న నిర్వాహకులు, వారికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాగానే ఊళ్లలో సమావేశాలు పెట్టి, అధిక వడ్డీ ఆశచూపి ఆ డబ్బును తమ సంస్థలో పెట్టుబడి పెట్టేలా చేశారు. చాలామంది మహిళలు తమ బంగారాన్ని, ఇంటి పత్రాలను సైతం తాకట్టు పెట్టి మరీ ఇందులో డిపాజిట్ చేయడం గమనార్హం.
డిపాజిట్లు భారీగా రాగానే సంస్థ నిర్వాహకులు మార్చి నెల నుంచి చెల్లింపులు నిలిపివేశారు. గట్టిగా నిలదీసిన వారికి అరకొరగా చెల్లించి, మరికొందరికి చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే సంస్థకు చెందిన నిధులు పక్కదారి పట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థకు చెందిన కరెంటు ఖాతాల నుండి దాదాపు 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. శివాని తల్లిదండ్రుల నివాసంలో బాధితులు పరిశీలించగా భారీగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన రశీదులు లభించాయి. అలాగే శివాని బినామీల పేర్లతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విస్సన్నపేట పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ఇప్పటికే మృతి చెందగా, ఆయన భార్య శివాని ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రెడ్డిగూడెం మండలంలో ఆమె ఉన్నట్లు ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన అట్టదేవర రాజేష్ అనే బాధితుడు తాను రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయానని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్, డిపాజిటర్ల చట్టం కింద కేసు నమోదు చేశారు. సంస్థ బ్యాంకు లావాదేవీలను పరిశీలించి, ఖాతాలను సీజ్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Latest