- రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
- పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- హాజరైన బండారు దత్తాత్రేయ, శ్రీధర్ బాబు, రామచందర్ రావు
- తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన 7.2 అడుగుల విగ్రహం.
హైదరాబాద్, మహా : రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.
7.2 అడుగుల ఎత్తు ఉన్న బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఈరోజు సాయంత్రం 50 మందితో సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాల కోసమే రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. నెల్లూరులోని తన ఇంటిని వేద పాఠశాలకు బాలు ఇచ్చేశారని గుర్తు చేశారు. బాలు మన మధ్య లేకున్నా.. పాట రూపంలో మనతోనే ఉన్నారని చెప్పారు. ప్రతిఒక్కరి మనస్సులో బాలసుబ్రహ్మణ్యం చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.
బాలు విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ గాయని, ఆయన సోదరి ఎస్పీ శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని వెల్లడించారు. తన విగ్రహాన్ని పెట్టాలని ఆర్కెస్ట్రా వారి వద్ద బాలు వ్యక్తం చేయగా, వారు అతనిని వారించారని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె అన్నారు. తెలుగును మరిచిపోవద్దని, క్రమశిక్షణగా ఉండాలని ఎస్పీ బాలు ఎప్పుడూ చెప్పేవారని అన్నారు.
మరోవైపు.. బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ వాదులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోపాటు ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణ సమయంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన తెలంగాణ వాదులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.






