- నా ఊర్లోనే నన్ను ఓడించారు
- గ్రామాభివృద్ధికి కోటిన్నర ఖర్చు చేశా
- భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, మహా : పంచాయతీ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సొంతరు రంగారెడ్డి గూడ ప్రజలు షాకిచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి విజయం సాధించారు. దీనిపై స్పందించిన అనిరుధ్ రెడ్డి.. గ్రామాభివృద్ధికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేసినా.. సొంతూరోళ్లే తన గుండెల మీద కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డిగూడ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం ఎమ్మెల్యేకు పెద్ద షాక్‌గా మారింది. గ్రామంలో పోలైన 972 ఓట్లలో, బీజేపీ అభ్యర్థి ‘కాటేపాగ రేవతి’కి 490 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రేవతి 31 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఓటమిపై స్పందించిన అనిరుధ్ రెడ్డి.. “సొంత ఊరు రంగారెడ్డిగూడ అని చెప్పి ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రూ.1.50 కోట్లు నా చేతులతోనే మంజూరు చేశాను. కానీ, నన్ను అందరు కలిసి నమ్మించి సొంత ఊరోళ్లే సర్పంచ్ ఎన్నికల్లో నా గుండెల మీద కొట్టారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యర్థి ఓటమికి బయటి నుంచి వేరే పార్టీ నాయకులు రంగారెడ్డిగూడకు వచ్చి కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. సాధారణంగా సొంతూరిలో ఎమ్మెల్యేలు బలంగా ఉంటారు. అనిరుధ్ రెడ్డి అంతటి ఖర్చు చేసి అభివృద్ధి చేసినప్పటికీ.. ఓటమి పాలు కావడం, కేవలం ప్రతిపక్ష పార్టీల కుట్రల కంటే.. పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రచారం రంగారెడ్డిగూడ ప్రజల మనసుల్లో ఏదో ఒక స్థాయిలో వ్యతిరేకతను పెంచి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.






