27న కరాటే డో అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం.
* అసోసియేషన్ సభ్యులందరూ తప్పక హాజరుకావాలి: అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో కరాటే క్రీడను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లోని కరాటే హాల్ ఈ సమావేశానికి వేదికగా నిలవనుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్‌కు చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ట్రెజరర్స్) తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర స్టేట్ స్టైల్ చీఫ్స్ మరియు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అనుబంధం కలిగిన ఇండియా చీఫ్స్ అందరూ ఈ భేటీలో పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా సంస్థ భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, రాష్ట్రంలో కరాటే క్రీడను మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
క్రీడాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో, సంబంధిత సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.







