న్యూఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ.
* ‘తెలంగాణ రైజింగ్ 2047’ నివేదిక అందజేత.
*రేవంత్ దూరదృష్టికి సోనియా గాంధీ అభినందన.
* ‘తెలంగాణ రైజింగ్’తో ముందుకు వెళ్లాలి..సీఎంకు సోనియా సూచన.
ఢిల్లీ, మహా.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన ప్రణాళికలు, గత రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ జరిగింది.
ఇటీవల డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్’ అంతర్జాతీయ సదస్సు విజయవంతమైన తీరును సీఎం రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీకి తెలియజేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన సానుకూల స్పందన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
గత రెండేళ్లుగా ‘ప్రజా పాలన’లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అవి లబ్ధిదారులకు చేరుతున్న తీరును సీఎం వివరించారు. కేవలం సంక్షేమమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను సోనియా గాంధీ ముందుంచారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ విన్న అనంతరం.. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వ పనితీరుపై సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న దూరదృష్టిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ నివేదికకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.








