Mahaa Daily Exclusive

  ఆరేళ్ల సేవలకు ఫుల్‌స్టాప్.. కొత్త సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణభాస్కర్….

Share

హైదరాబాద్, మహా.

సింగరేణి సంస్థ ఇన్‌ఛార్జి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న ఎన్. బలరాం కేంద్ర సర్వీసుల గడువు ముగిసింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలరాం స్థానంలో తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కృష్ణభాస్కర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర రెవెన్యూ సర్వీసు విభాగానికి చెందిన ఎన్. బలరాం గతంలో కేంద్రం నుంచి ప్రత్యేక విధుల్లో భాగంగా (డిప్యుటేషన్‌పై) తెలంగాణకు వచ్చారు. సింగరేణిలో ఆయన ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. తొలుత సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అనంతరం ఇన్‌ఛార్జి సీఎండీగా పదోన్నతి పొందారు. మొత్తంగా ఆయన సింగరేణి సంస్థలో ఆరేళ్ల పాటు కీలక సేవలందించారు.
సాధారణంగా కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చే అధికారుల గడువు ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. అయితే బలరాం విషయంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరో ఏడాది పాటు అదనంగా కొనసాగే అవకాశం లభించింది. ప్రస్తుతం ఆ ఆరేళ్ల గడువు కూడా పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే గరిష్ట గడువు ముగిసినందున.. మరోసారి పొడిగింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్‌కు సింగరేణి పగ్గాలు అప్పగించారు.

Latest